Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
వరిసాగుకు వెదజల్లే విధానం అన్నదాతకు ఆశాజనకంగా ఉంటుందని గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. గురువారం సత్తుపల్లి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి మండలంలోని సదాశివునిపాలెంలో 300 ఎకరాల్లో సాగవుతున్న కరివేద విధాన వరిసాగును స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం ఆసరా ఫించన్లకు ప్రభుత్వం వయో పరిమితి తగ్గించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. పామాయిల్ సాగు చాలా అవసరమని, డిమాండ్ ఉన్న వాణిజ్య పంటను రాష్ట్రంలో విస్తారంగా సాగుచేసేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయన్నాయన్నారు. వ్యవసాయం పండగ చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఉద్యోగస్తులకు పిల్లనిచ్చిన రోజులు పోయి రైతులకి పిల్లల్ని ఇచ్చే రోజులు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రయోగాత్మకంగా 50 ఎకరాలలో వెదజల్లే సాగు విధానం చేపట్టారన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ జిల్లాలో 16 వేల ఎకరాల్లో కరివేద సాగు విధానం చేస్తుండగా అందులో పది వేల ఎకరాలు సత్తుపల్లి నియోజకవర్గంలోనే సాగుతుందన్నారు. వాణిజ్య పంటల్లో పామాయిల్ అగ్రభాగాన్ని పోషిస్తుందని, టన్ను రూ.16 నుంచి 20 వేలు పలుకుతుందని, రాష్ట్రవ్యాప్తంగా సాగు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో సాగుతున్న పామాయిల్, వరిలో కరివేద సాగు విధానాన్ని పరిశీలించేందుకు స్టేషన్ ఘన్పూర్ ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది రైతులు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.