Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలో దామన్నకు ఉన్నత పదవి
- చెవిటి వెంకన్నలో రెట్టింపైన ఉత్సాహం
- జిల్లాలో రోజుకో రీతిలో కార్యక్రమాలు
- జిల్లాలో పాగా వేసేందుకు వ్యూహాలు
నవతెలంగాణ - తుంగతుర్తి
సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి దక్కింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపినట్లైంది. దీంతో డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ జిల్లాలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం ఆ రెండు స్థానాలను కూడా అధికార పార్టీ కైవసం చేసుకుంది. అయితే రెండేండ్లుగా జిల్లాలో పార్టీకి చెప్పుకోదగ్గ విజయాలు లేవు. దీంతో కార్యకర్తలు, నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో రాష్ట్రం, జిల్లా కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. దీనికి కారణంగా సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్ష పదవి రావడమే కారణంగా చెప్పొచ్చు.
వరుస కార్యక్రమాలతో జోష్
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారధిగా ఉన్న చెవిటి వెంకన్న యాదవ్ ఈ మధ్యకాలంలో దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో నూతన ఉత్సాహం నింపుతున్నారు. మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలనూ హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడు యువతలో ఆయనకు ఉన్న ఆదరణ రానున్న రోజుల్లో బాగా కలిసొస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
గ్రూపు రాజకీయాలకు చరమగీతం
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు తగాదాలను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ ఇక నుంచి పార్టీకి తెలియకుండా సొంతంగా ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని, అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న గ్రుపుల గోలకు చరమగీతం పాడినట్టు అయ్యిందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పెద్ద నాయకులను సమన్వయ పరచడంలో ఆయన సఫలం అయినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిల నాయకత్వంలో అధికార టీఆర్ఎస్కు దీటుగా జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే సంకల్పంతో చెవిటి వెంకన్న ఉన్నారనేది నిజం.