Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ - మోతే
యూటీఎఫ్ మాజీ నాయకులు, సీపీఐ(ఎం) సీనియర్ నేత పొదిల చంద్రయ్య మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. మండలానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు పొదిల చంద్రయ్య (75) మృతి చెందారు. ఈ మేరకు గురువారం పొదిల చంద్రయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి మండలం పసునూరు గ్రామానికి చెందిన పొదిల చంద్రయ్య చిన్నతనంలోనే గ్రామంలోని భూస్వాములు పెట్టే ఇబ్బందులను కళ్లారా చూశారని గుర్తు చేశారు. ఆ గ్రామంలో యువకులను కూడగట్టి భూస్వాము లకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ఆ ప్రాంత నాయకులైన మల్లు స్వరాజ్యం, బీఎన్ శిష్యరికంలో పని చేశారని పేర్కొన్నారు. ఓ కమ్యూనిస్టు పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేస్తూ మరో పక్క విద్యపై కూడా మక్కువ పెంచుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారన్నారు. అదే విధంగా యూటీఎఫ్ నాయకుడిగా ఉంటూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి గుంటగాని యేసు, మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, చర్లపల్లి మల్లయ్య, గ్రామ శాఖ కార్యదర్శి బూడిద లింగయ్య, చంద్రయ్య కుమారులు ప్రదీప్ కుమార్, దిలీప్ కుమార్, రవికుమార్, భార్య అనసూర్య తదితరులు పాల్గొన్నారు.