Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగారం
గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం హరితహరం పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది. మొక్కల పెంపకం కోసం గ్రామాల్లో నర్సరీలూ ఏర్పాటు చేస్తోంది. ఇందులో పెంచిన మొక్కలను గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో నాటుతున్నారు. పథకం ఉద్దేశం బాగానే ఉన్నా...కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు.
మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు...కానీ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. మొక్కల సంరక్షణకు వాచర్ నియమించినా వాటి పర్యవేక్షణ లేక పోవడంతో ప్రకృతి వనంలో నాటిన మొక్కలన్నీ ఎండిపోయాయి. నాటిన మొక్కలకు సరిగా నీరు పోయక పోవడంతో మొక్కలు ఎండి పల్లె ప్రకృతి వనం ఖాళీగా దర్శనమిస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పెంట దెబ్బలను తొలగించాల్సి ఉండగా పాఠశాలల పక్కనే ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. గత నెలలో పూర్తి కావాల్సిన స్మశాన వాటిక పనులు కూడా నేటి వరకూ పూర్తి కాలేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటిస్తాం
శోభారాణి - ఎంపీడీవో
ఎండిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటిస్తాం. సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బందికి నోటీసులు పంపిస్తాం. గ్రామంలో ఉన్న పెంట దిబ్బలను తొలగిస్తాం.