Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని అడ్డుకున్న ఓ గ్రూపు
- లంగర్ హౌస్ భూమంటూ కొందరు.. గ్రామకంఠమంటూ మరికొందరు
వాదనలు
- రంగంలోకి దిగిన రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు
- డీసీపీ ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మండలంలోని ఎల్లంబావి గ్రామంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదరి-65ను అనుకొని ఉన్న స్థలంలో ఎల్లంబావి గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానంతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం ఫిిల్లరు గుంతలు తీశారు. దీనికి ఎదురుగా ఉన్న భూమిలో ఓ వర్గానికి చెందిన ప్రార్థన మందిరం ఉంది.గ్రామపంచాయతీ నిర్మించే స్థలం తమ వర్గానికి చెందిన భూమంటూ పనులను అడ్డుకున్నారు. లంగర్ హౌస్(గుర్రాలను కట్టెసే స్థలం)ఉండేదని అందులో గ్రామపంచాయతీ నిర్మాణం చేయడం తగదని ఓ వర్గం వారు వాదిస్తున్నారు. అయితే ఈ భూమి కొన్ని దశాబ్దాలుగా గ్రామ కంఠం కింద ఉందని ఎల్లంబావి గ్రామస్తులు చెప్తున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కి సొంత భవనం లేకపోవడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి,గ్రామకంఠంగా భావిస్తున్న భూమిలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించాలని భావించారు. ఓ వర్గం వారు ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల వారు ఆ స్థలం వద్దకు శుక్రవారం చేరుకున్నారు.దీనితో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ముందస్తు సమాచారం మేరకు డీసీపీ కె.నారాయణరెడ్డి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ సర్వేయర్స్ తో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు వక్ఫ్ బోర్డు అధికారులు వచ్చారు. ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి పోలీస్ బందోబస్తు మధ్య ఆ భూమిని డీపీఎస్ సహకారంతో మార్కింగ్ ఇచ్చారు. గ్రామస్తుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను,వక్ఫ్ అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను రెవిన్యూ అధికారులు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇరువర్గాలకు సర్దిచెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలువరించారు. గ్రామస్తులకు మద్దతుగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి,సర్పంచ్ గుర్రం కొండయ్య,మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, కంది లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు వచ్చారు. వక్ఫ్ బోర్డు అధికారులు ఓఎస్డి అసదుల్లాఖాన్,వర్క్ ఇన్స్పెక్టర్ మహుమ్మద్,లీగల్ అడ్వాకేట్ యండి.రజియోద్దీన్,సర్వేయర్ సుజాతుల్లా, ఆఫీసర్ అబ్దుల్లా,రెవిన్యూ ఏడి మధుసూదన్,డిఐ వెంకటయ్య,సర్వేయర్ వెంకన్న,ఆర్ఐ ఉప్పు రాజేష్,ఎంపీడీఓ రాకేష్ రావు,సీఐ నేతి శ్రీనివాస్, వెంకటయ్య వచ్చి ఇరువర్గాల వారితో చర్చించారు.
- తుది నివేదిక ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేయొద్దు..
ఇరు వర్గాలతో చర్చించిన తర్వాత చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ కంఠమని గ్రామపంచాయతీ నిర్మిస్తున్న స్థలంలో తుది నివేదిక ఇచ్చేవరకు ఎలాంటి పనులు చేయొద్దని సూచించారు. అదేవిధంగా తీసిన ఫిిల్లర్ గుంతలు పూడ్చి వేసే చర్యలు కూడా చేయొద్దని అన్నారు. రెవెన్యూ రికార్డులు,వక్ఫ్ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆధారంగా సర్వే చేసి నివేదికను అయిదు రోజుల్లో ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. అప్పటి వరకు పోలీస్ పికెటింగ్ ఉంటుందని చెప్పారు.