Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి భయపడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
- ఎర్రజెండాకు ఎదురు లేదు
- కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకున్న సీపీఐ(ఎం)
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నూతనకల్
ఃహుజురాబాద్ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ దళితబందు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకానికి మేము వ్యతిరేకం కాదు..కానీ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, మైనార్టీల కోసం కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అమలు చేయాలిః అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఆదివారం పార్టీ గ్రామ శాఖ మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో సీఎ కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తొలి దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలప్పుడు కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ ఓట్లు వేయించుకొని తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తమ్మినేని ప్రజలను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యను ఇద్దరు సీఎంలు కూర్చొని పరిష్కరించుకోవచ్చని, కానీ ఇది ఓట్ల కోసమే వారు ఆడుతున్న నాటకమనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. నీటి సమష్కరించుకోక పోవడంతో ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం లాక్కొందన్నారు. ఇప్పటికే వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం వంటి కీలక రంగాలపై కేంద్రం తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఆయా రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వానికి భయపడుతున్నాయనేది కనిపిస్తుందని తెలిపారు.
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కరోనా సమయంలో తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. మండలాలు, జిల్లాలు, రాష్ట్రంలోని అన్ని పార్టీ కార్యాలయాలనూ కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి బాధితులకు ఆక్సిజన్, భోజన సదుపాయంతో పాటు అన్ని రకాల సేవలూ అందించినట్టు చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో కరోనాను కట్టడి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఃదీపాలు వెలిగించండి..చప్పట్లు కొట్టండి..ఆవు పేడ తినండి..గోమూత్రం తాగండి..అప్పడాలు తినండిః అంటూ మూఢ నమ్మకాలతో ఎంతో మంది ప్రాణాలు తీసిందన్నారు. దేశంలో ఇప్పటివరకూ 11 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని, మిగిలిన 89 శాతం మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు 50 వరకూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకటి, రెండు కంపెనీలకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. ఇలా వేసుకుంటూ పోతే ఇంకా రెండేండ్ల వరకూ టీకాలు వేయడం పూర్తి కాదన్నారు. కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా రూ.7000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం అనుచరులుగా ఉంటూ భూ స్వాములను తరిమికొట్టి గ్రామంలో ఎర్రజెండాను నిలబెట్టారని, ఈ పోరాట స్ఫూర్తి ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ చెక్కుచెదరలేదన్నారు. ఇదే స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు మాట్లాడుతూ నాడు చేసిన త్యాగాలు, పోరాటాలు ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో ఎర్రజెండాను నిలబెట్టాయన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి బొజ్జ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, శ్రీను, లక్ష్మి, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, పులుసు సత్యం, నీలం సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.