Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు మండలాలతో పోలీస్ సర్కిల్ చేయాలని డిమాండ్
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంగా ఏర్పడిన మోత్కూరును పోలీస్ సర్కిల్ చేయాలన్న డిమాండ్ వినిస్తోంది. ప్రస్తుతం రామన్నపేట పోలీస్ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఉండటంతో ఒక్కో పనికి ఒక్కో చోటుకు వెళ్లాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రామన్నపేట పోలీస్ సర్కిల్ (సీఐ)లో రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం) మండలాలు ఉన్నాయి. గతంలో ఈ సర్కిల్ పరిధిలోనే గుండాల మండలం కూడా ఉండగా జిల్లాలు, మండలాల పునర్విభజనతో గుండాల మండలం జనగాం జిల్లాలోకి వెళ్లడంతో ప్రస్తుతం గుండాల మండలం పోలీస్ శాఖ (గుండాల మళ్లీ యాదాద్రి జిల్లాలో విలీనమై చాలా శాఖలు కలిసినప్పటికీ) పరంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నది. దీంతో గుండాల పోలీస్ స్టేషనను వరంగల్ కమిషనరేట్ నుంచి రాచకొండ కమిషనరేట్ లో కలిపి మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాలను కలిపి మోత్కూరు కేంద్రంగా పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేయాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు.
కలగూర గంపలా ఉన్న రామన్నపేట సర్కిల్
రామన్నపేట పోలీస్ సర్కిల్లో రామన్నపేట, వలిగొండ, ఆత్మకూరు(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు మండలాల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ సర్కిల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏవైనా కేసులైతే వేర్వేరు కోర్టులకు వెళ్లాల్సి వస్తుండటంతో సరైన రవాణా సదుపాయం, ఇతరత్రా సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రామన్నపేట, వలిగొండ, మోత్కూరు పోలీస్ స్టేషన్లలో కేసులైతే రామన్నపేట కోర్టు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లలో కేసులైతే ఆలేరు కోర్టుకు వెళ్లాల్సి వస్త్తోంది. రామన్నపేట సర్కిల్ మండలాలు రామన్నపేట మండలం నకిరేకల్ నియోజకవర్గం, వలిగొండ మండలం భువనగిరి, ఆత్మకూరు(ఎం) మండలం ఆలేరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు తుంగతుర్తి నియోజకవర్గాల (నాలుగు నియోజకవర్గాల) పరిధిలోకి వస్తుండటంతో సీఐగా పని చేసే పోలీస్ అధికారి నలుగురు ఎమ్మెల్యేల ద్వారా రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయంటున్నారు. ఏసీపీ పరంగా చౌటుప్పల్ పరిధిలో ఉంది. రాచకొండ కమిషనరేట్లో ఉన్న యాదాద్రి జిల్లాలో రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట పోలీస్ సర్కిళ్లు ఉండగా యాదగిరిగుట్ట సర్కిల్లో రాజాపేట, తుర్కపల్లి, ఆలేరు, మోటకొండూర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ సర్కిల్లో పోచంపల్లి, ఎస్.నారాయణపురం, చౌటుప్పల్ ఉండగా, రామన్నపేట సర్కిల్లో రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గుండాల పోలీస్ స్టేషన్ త్వరలోనే రాచకొండ కమిషనరేట్లో కలువనున్నందున ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం పక్కపక్కనే ఉన్న మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల పోలీస్ స్టేషన్లను కలిపి మోత్కూరు మున్సిపల్ కేంద్రంగా పోలీస్ సర్కిల్ (సీఐ) కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మోత్కూర్ను పోలీస్ సర్కిల్ చేయాలి
అవిశెట్టి అవిలిమల్లు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు, మోత్కూర్
మున్సిపల్ కేంద్రంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలి. పక్కపక్కనే ఉన్న మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాలతో పోలీస్ సర్కిల్ చేయాలి.
లా అండ్ ఆర్డర్ పరంగా సౌకర్యంగా ఉంటుంది
గుండు వెంకటనర్సు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మోత్కూరు
మోత్కూర్ కేంద్రంగా పోలీస్ సర్కిల్ చేసినట్టయితే ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ పరంగా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రెండు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చి రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా వరకు తగ్గుతాయి. పోలీసు శాఖ, కోర్టు కేసుల పరంగా ఒకే సర్కిల్ లో ఉండేలా చూడాలి.