Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ ట్విట్టర్‌కు స్పందించిన ఎమ్మెల్యే
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
నవతెలంగాణ-హాలియా
రాష్ట్ర పాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిన ట్విట్టర్ మెసేజ్‌కు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ స్పందించారు. మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితునికి ప్రభుత్వం నుంచి ఇంటి స్థలంతో పాటు, డబుల్బెడ్రూం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కు చెందిన భవాని బహదూర్ 20 ఏండ్ల క్రితం హాలియాకు వచ్చి నివాసం ఉంటున్నాడు. రాత్రి వేళల్లో గుర్కా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఎనిమిది మంది సంతానం. ఇందులో ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీళ్లంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం బహదుర్కు రేషన్ కార్డు కూడా మంజూరు చేసింది. కరోనా నేపథ్యంలో బహదుర్ కుటుంబం అనేక ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని బహదూర్‌పై ఒత్తిడి చేస్తున్నాడు. ఏం చేయాలో తోచక బహదూర్ అనేక ఇబ్బందులు పడసాగాడు. విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన నరేష్ ఫౌండేషన్ అధినేత గొట్టిముక్కుల నరేశ్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌కు స్పందించిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బాధితుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే బాధితుని కుటుంబాన్ని పరామర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బాధితుడి కుటుంబం ఈ సందర్భంగా నరేష్‌కు కృతజ్ఞతలు తెలిపింది.