Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
విశాఖ సంస్కృతి తెలుగు మాస పత్రిక 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ బాలల కథలు-2020 పోటీల్లో ప్రముఖ బాలల రచయిత పుప్పాల కృష్ణమూర్తికి ప్రథమ బహుమతి లభించింది. మొత్తం పోటీలో 71 మంది రచయితలు తమ రచనలు పంపగా కృష్ణమూర్తికి ప్రథమ స్థానం దక్కడ విశేషం. విశాఖపట్నంలోని ద్వారకా నగర్, పౌర గ్రంథాలయంలో విశాఖ సంస్కృతి సంపాదకులు శిరేల సన్యాసిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆంధ్రా యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ చందు సుబ్బారావు చేతుల మీదుగా కృష్ణమూర్తి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా చందు సుబ్బారావు మాట్లాడుతూ విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో కథ పోటీ నిర్వహించి, రచయితలను ప్రోత్సహించడం మంచి పరిణామమన్నారు. విజయవాడకు చెందిన మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సౌజన్యంతో బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. బహుమతి గ్రహీత కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంత మంది పాల్గొన్న పోటీలో తన కథకు ప్రథమ బహుమతి దక్కడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. రచయితలను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహించడం పట్ల విశాఖ సంస్కృతి మాస పత్రిక యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కృష్ణమూర్తికి ప్రథమ బహుమతి దక్కడం పట్ల పలువురు రచయితలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ రచయితల సంఘం కార్యదర్శి అడపా రామకృష్ణ, భువన విజయం అధ్యక్షులు జె.ఎం.ఆర్. నెహ్రూ, నాని పిల్లల పత్రిక సంపాదకులు ఎస్.కె. బాబు, పలకలూరి శివరావు, మేడా మస్తాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.