Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానోపోపాధ్యాయురాలి నిర్వాకం
నవతెలంగాణ-చింతపల్లి
గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ పాఠశాల వస్తువులు విక్రయించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కురుమేడు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలమవడంతో ప్రభుత్వం నూతన భవనాన్ని మంజూరు చేసింది. పాత భవనం కూల్చివేసి కొత్త భవనం నిర్మించడానికి టెండర్ పూర్తయ్యింది. పాత భవనం ఫిబ్రవరిలో కూల్చివేయగా ఆ భవన నిర్మాణానికి ఉపయోగించే రూ.లక్షల విలువ చేసే సామగ్రి, ఇతర వస్తువులను ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణికి అప్పగించారు. కొంతకాలంగా కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరవడం లేదు. ఇటీవలే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు ప్రధానోపాధ్యాయులు పాఠశాల వస్తువులు విక్రయించినట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన కొంత స్థలం కూడా విక్రయించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై ప్రధానోపాధ్యాయురాలిని వివరణ కోరగా పాఠశాల అభివృద్ధి కోసమే పాఠశాల వస్తువులు విక్రయించానని, కమిటీతో తీర్మానం చేయించామని తెలిపారు. కానీ తీర్మానంలో ప్రధానోపాధ్యాయురాలి సంతకం తప్ప పాఠశాల విద్యా కమిటీ చైర్మెన్, సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీల సంతకాలు లేవని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తీర్మానం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని విక్రయించడం సరికాదన్నారు.