Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాడి వేడీగా మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ- నాంపల్లి
స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతరవీందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సమావేశంలో అధికారుల పని తీరుపై పలువురు ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సంవత్సరానికిపైగా మండలంలో పంచాయతీ రాజ్ ఏఈ లేకపోవడం దురదృష్టకరమని, తాము చేసిన పనులకు రికార్డు చేసేవారు లేక బిల్లులు ఆగి పోయాయని పలువురు సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పల్లె ప్రగతి పనులు టార్గెట్ విధించి చేయించే విధంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి పంచాయతీ రాజ్ ఇన్చార్జ్ ఏఈ భాష మాట్లాడుతూ సర్పంచులు తమ గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అవసరమైన సిమెంటు రోడ్లు, డ్రయినేజీలు, వీధి దీపాలు పనులను గుర్తించి తీర్మానం చేసి పంపించాలని కోరారు. ఐసీడీఎస్ సీడీపీవో ప్రజాప్రతినిధులకు సరైన సమాధానం, సమాచారం ఇవ్వడం లేదని, కనీస మర్యాద, గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారని మల్లాపూర్ రాజుపల్లి సర్పంచ్ సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. జెడ్పీటీసీ లుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అధికారులు కేవలం జీతాల కోసమే పని చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సర్పంచులు ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడూ సమాచారం ఇస్తూ వారిని గౌరవించాలని సూచించారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు కోరే హేమలత, లీల ప్రియా, కొమ్ము యాదమ్మ, పాండు, యాదగిరి, విష్ణు, రవినాయక్, రాములు, ఎంపీడీవో శేషుకుమార్, తహసీల్దార్ లాల్ బహదూర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రం, ఆర్అండ్బీ ఏఈ మహమూద్, డాక్టర్ ఇక్బాల్, మండల వ్యవసాయ అధికారి బొడ్డుపల్లి హరి వెంకటప్రసాద్, ఏపీఎం యాదయ్య, ఈసీ తుల్జానాయక్, ఎక్సైజ్ ఎస్సై వీరేష్ పాల్గొన్నారు.