Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
సుమారు 15 రోజులుగా చినుకు జాడ లేకపోవడం, ఎండలు దంచి కొడుతుండటంతో పత్తి, కంది తదితర మెట్ట పంటలు వాడిపోతున్నాయి. వానాకాలం తొలకరిలో వర్షాలు కురిసి రైతులు పత్తి, కంది పంటలు సాగు చేశారు. చేలు ఎదిగి, కాంప్లెక్స్ ఎరువులు పోసే దశలో జూలై మొదటి, రెండు వారాల్లో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో చేలు ఎరుపెక్కాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాక రైతులు గుంటుక తోలి చేలకు కాంప్లెక్స్ ఎరువులు వేయగా సుమారు 15 రోజులకు పైగా వానలు లేకపోవడం, తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో చేలు అదిరిపోయి ఎదుగుదల కుంటుపడుతుంది. దీంతో పెట్టిన పెట్టుబడి నష్టపోతామని, చేలను ఎలాగైనా కాపాడుకోవాలని రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పలువురు రైతులు వాడిపోతున్న పత్తి చేలకు పైపులు వేసి నీటి తడులు పెడుతున్నారు. ఓవైపు వర్షాలు ముఖం చాటేయగా, మరోవైపు వేళాపాళా లేని కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ప్రస్తుతం అసలేరు కార్తె లో వర్షాలు కురిసి బురదతో లసలస అన్నది రైతుల సామెత కాగా ప్రస్తుతం వానలు లేకపోవడం, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతూ విచిత్రమైన పరిస్థితి నెలకొనడంతో రైతుల్లో గుబులు నెలకొంది. ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, పరిస్థితి ఇలానే ఉంటే నిండా మునుగుతామని జామచెట్లబావి గ్రామానికి చెందిన పత్తి రైతులు మర్రి నారాయణ, గనగాని పరుశురాములు, కొండాపురం కు చెందిన బాలాగోని శ్రీనివాస్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.