Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 ఏండ్లుగా పాలకమండలే లేదు...
- నిర్ణయాలు ఆఫీసర్లే చేస్తుండ్రు
- అనువంశిక ధర్మకర్త ఉత్సవ విగ్రమే
- ఆశావహుల ఎదురుచూపులు
నవతెలంగాణ-యాదాద్రి
విశ్వక్షేత్రంగా రూపొందుతోన్న యాదాద్రి ఆలయానికి పుష్కరకాలంగా పాలకమండలి నియామకం జరగలేదు. యాదగిరిగుట్ట దేవస్థానంగా ఉన్న ఈ క్షేత్రం తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించాక యాదాద్రిగా పేరొందింది. ధర్మకర్తలు లేక ఆలయం ఆలనా పాలనా అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలక మండలి ఊసేత్తేవారు లేక ఈ ఆలయంలో చేయాల్సిన, చేపట్టాల్సిన నిర్ణయాలు చతికిలపడ్డాయి. కాని ఆలయ అభివృద్ధి పేరుతో వైటీడీఏ ఏర్పాటు చేసి చైర్మెన్గిరి కేసీఆర్ భద్రపరుచుకున్నాడని భక్తజనం వాపోతున్నారు. దీంతో ఇక్కడ టెంపుల్ ఆఫీసర్లదే హవా సాగుతోంది. ఇంత పెద్ద కొండ...అంత బరువు మోస్తుంటాం...మాపైనే నాలుగు రాళ్లు వేయడం న్యాయం కాదు..అన్నట్టు ఇక్కడి ఆఫీసర్లు ఫీలవుతారు.
13 ఏండ్లుగా పాలకమండలే లేదు...
గత 13 ఏండ్లుగా ఈ కొండకు ధర్మకర్తల పాలకమండలి లేకుండా కేవలం ఆఫీసర్లతోనే సాగుతోంది. ధర్మకర్తల పదవీ కాలం 2009 నవంబర్ 18 న ముగిసింది. తిరిగి 2015 ఫిబ్రవరి 14న ఆలయ పాలకమండలి నియామకం కోసం 221జీవోను జారీ చేసి నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు విస్మరించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజులలోపు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వాటిని పరిశీలించి ధర్మకర్తలను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ప్రస్తుతం పాలకమండలి ఊసేత్తేవారే కరువయ్యారు.
1966లోనే చట్టం....
సేవాగుణం, సచ్చీలత ఆధారంగానే..
నిజాం కాలం నుంచి ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది. 1966లో దేవాదాయ చట్టం రూపొందించ తర్వాత వంశపారం పర్య ధర్మకర్తే ఈ ఆలయానికి పాలకమండలి చైర్మెన్‌గా ఉండేవారు. కాగా మరో 8మంది సభ్యులను నియమించి ఆలయ ఆలనా పాలనా చూడాల్సిందిగా కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ పాలక మండలి ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడుతూ..దాతలను సంప్రదించి విరివిరిగా విరాళాలు పోగుచేసేది. ఈ క్రమంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న పాలకమండలి కీలకపాత్ర పోషించేది. కాలక్రమేణ ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో ధర్మకర్తల ఎంపిక విషయంలో తీవ్రమైన పోటీ ఉండేది. కాలాగుణంగా గత ప్రభుత్వాలు వంశపారపర్యతకు స్వస్తి పలికాయి. నామినేటెడ్ పోస్టుల నియామకం ఎందుకు బ్రేక్ చేశారో అంతా సస్పెన్స్.
ప్రతి అంశంలోనూ...
ప్రస్తుతం ఇక్కడ పాలకమండలి లేకపోవడంతో అనువంశిక ధర్మకర్త (మాజీ చైర్మెన్) ఆలయంలోని ఉత్సవమూర్తిగా మిగిలిపోయారని భక్తులు భావిస్తున్నారు. వారి హయాంలో ఆలయానికి చెందిన ప్రతి అంశంలోనూ ఈ పాలకమండలి చొరవ చేసి చర్చించి నిర్ణయాలు తీసుకునేది. ఏ పనైన అనువంశిక చైర్మన్ అంగీకారంతో అవి అమలయ్యేవి.
ప్రాధాన్యతే లేదు
తెలంగాణ ప్రభుత్వం ఈ అనువంశికం, అలాగే ధర్మకర్త మండలికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వార్షిక బ్రహ్మోత్సవాల్లోనే ఇక్కడి అనువంశిక ధర్మకర్త ఉత్సవమూర్తిగా దర్శమిస్తారని యాదగిరిగుట్ట స్థానిక భక్తులు వాపోతుంటారు. అసలు ఆలయ పునర్నిర్మాణం పనులలో ప్రాధాన్యత కూడా ధర్మకర్తకు లేకపోవడం స్థానిక భక్తులను కలచివేస్తోంది. ప్రధాన ఆలయం ప్రారంభం తర్వాతనైనా ఈ అనువంశిక ధర్మకర్తకు ప్రాధాన్యత ఇస్తారా..! లేక ధర్మకర్త మండలి నియామకం చేస్తారా..! అనువంశికతను కొనసాగిస్తారా..? లేక తొలగిస్తారా..? అనే అంశాలపై ప్రభుత్వం ఇవ్వనున్న క్లారీటీ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.