Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రాకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని యాదాద్రి కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగాలివ్వడం లేదని నిరాశతో ఆత్మహత్య చేసుకున్న 38 మంది నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలిచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను, జిల్లా నాయకులు వినోద్ నాయక్, గూడ నాగేంద్రప్రసాద్, శ్రీనునాయక్, గోరిగే రామలింగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సైదానాయక్, జగన్, నాయకులు అయ్యూబ్ ఖాన్, పల్లా భిక్షం, జీలకర్ర నాగరాజు, పవన్, శివ, సందీప్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
హాలియా:ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టిన యాదాద్రి జిల్లా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బస్టాండు ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మాట్లాడారు. నిరుద్యోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారపు నరేష్, జగదీష్, నాగరాజు, శేషు, శ్రీను, వెంకన్న, ఆంజనేయులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ:ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ అధ్యక్షులు బుడిగ వెంకటేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం స్థానిక మునగాల కొండల్రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, గణేశ్, రమేశ్, సుందర్, లలిత, సుకన్య, మమత పాల్గొన్నారు.