Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరునెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు
- ఏండ్ల తరబడిగా పనిచేసిన పెరగని వేతనం
- వచ్చిన వేతనం ఖర్చులకే సరి...
- తమిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా కోశాధికారి గట్టుపల్లి సంజీవరెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఫ్లోరిన్ రహిత జలాల అందించాలని అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు ఎదుగూ,బొదుగూ లేకుండా అంధకారంలో మగ్గుతున్నాయి.జీతాల కోసం భగీరథ ప్రయత్నం చేయాల్సిన దుర్బర పరిస్థితి నెలకొంది.రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది కార్మికులు నిత్యం గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీరు అందించేందుకు అహర్నిశలు పని చేస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు వేల మంది కార్మికులు సేవలందిస్తున్నారు.మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన మేఘ,ఎల్ఎన్టీ, రాఘవ,జీవీపీఆర్, పీయాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు నీటిని సరఫరా చేసే బాధ్యతను అప్పజెప్పింది.క్షేత్రస్థాయిలో పని చేసేందుకు గాను కార్మికులను ఆయా సంస్థలు నియామకం చేసుకున్నాయి.రాష్ట్రస్థాయిలో 14 నుంచి 16 వేల రూపాయలు ఒక్కొక్క కార్మికునికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక్కో కార్మికునికి కేవలం రూ.8414 మాత్రమే చెల్లిస్తున్నారు.
అర్ధాకలిలో మిషన్ భగీరథ కార్మికుల జీవితాలు...
గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకొని కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రతిరోజు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో మిషన్ భగీరథ పైపులను పరిశీలించడం,ట్యాంకులు నింపి సక్రమంగా నీళ్లు అందించేందుకు సొంత వాహనము పెట్రోల్ అయ్యే ఖర్చు భరించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులకు చిత్రాలను ఆన్లైన్లో పంపుతూ విధులు నిర్వహిస్తున్న అప్పటికీ నెలనెలా వేతనాలు అందడం లేదు.దీంతో అప్పులు చేసి నిధులు సమకూర్చుకుని విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. లైన్మెన్లు గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులను, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీరందే విధంగా కషి చేస్తున్నారు.నిత్యం పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసర వస్తువులు ఇబ్బందులకు గురిచేస్తుంటే మరోవైపు సకాలంలో అందాల్సిన వేతనాలు అందక అన్నమో రామచంద్ర అనే స్థితిలో కార్మికులు మగ్గిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీరికి వేతనాలు చెల్లించ కుండా కాంట్రాక్టర్ల వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నడిపించడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన వస్తున్నాయి. జీవో నెంబర్ 11 ప్రకారం ప్రతి కార్మికునికి బేసిక్ వేతనంతో పాటు పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాల్సి ఉండగా ఇవేమీ పట్టని కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో ఏమి చేయాలో తెలియనిస్థితిలో కార్మికులు ఉన్నారు.
వేతనాల కోసం ... భగీరథ ప్రయత్నమే..
మిషన్ భగీరథ స్క్రీన్ మందు పనిచేస్తున్న ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన మేఘ,ఎల్ఎన్టీ, రాఘవ, జీవీపీఆర్,పీయాన్,ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాల్సి ఉంది.సకాలంలో ఇవ్వకపోవడంతో వేతనాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రజాప్రతినిధులకు అధికారులకు ముఖ్యమంత్రితో సహా ప్రతిసారి వేతనాలు ఇప్పించండి మహా ప్రభో అంటూ కార్మిక నాయకులు, కార్మికులు నిత్యం వినతిపత్రాలు ఇవ్వడం వారి చుట్టూ ప్రదర్శన చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అయినప్పటికీ ఆరు నెలల నుంచి వేతనాలు లేక అలమటిస్తున్నారు.