Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
2020 మార్చి నుండి (గత రెండు విద్యాసంవత్సరాల్లో) పాఠశాలలు నడవటమే లేదని, విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో జరగనేలేదని, సంక్షేమ హాస్టళ్ళు తెరవక పోవటంతో అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేనే లేవని, కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడర్ విభజన ఓ కొలిక్కి రానేలేదని, ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లో హడావుడిగా ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఏమొచ్చిందో అంతుచిక్కడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు.
లోగడ రేషనలైజేషన్ చేసే సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిపి చర్చించేవారు లేదా వ్రాతపూర్వకంగా అభిప్రాయాలను తీసుకునేవారని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇచ్చేవారని, ఈసారి అటువంటిదేమీ లేకుండానే ఏక పక్షంగా జిఓను విడుదల చేశారన్నారు. ఇచ్చిన జిఓ నెం. 25 లోనూ అస్పష్టత ఉన్నదన్నారు. 2019 - 20 యునైస్ ఆధారంగా అని కొన్నిచోట్ల 2020-21 యుడైస్ ఆధారంగా అని ఒకచోట పేర్కొన్నారన్నారు. 2020-21 యునైస్ గణాంకాలు ఇంకా ఫైనల్ కానేలేదన్నారు. మరి వాటి ఆధారంగా రేషనలైజేషన్ ఎలా చేస్తారో అర్థం కావడం లేదన్నారు. అదనపు పోస్టుల సర్దుబాటు కొత్త జిల్లాల ప్రకారం చేసేటలైతే పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక జిల్లాలో పోస్టులు అదనంగా తేలి మరొక జిల్లాలో అవసరం పడితే ఎలా సర్దుబాటు చేస్తారు? అని ప్రశ్నించారు. ఇటువంటి అనేక శేష ప్రశ్నల మధ్య రేషనలైజేషన్ ప్రక్రియను జరపటం అవసరమా అని ప్రశ్నించారు.
భవిష్యత్తులో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నదని, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పూర్తి స్థాయిలో ప్రారంభమై, విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తాజా గణాంకాల ఆధారంగా మాత్రమే రేషనలైజేషన్ గురించి ఆలోచించాలని అప్పటివరకు రేషనలైజేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని సిపిఎం జిల్లా కమిటి డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.