Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఆసరా దరఖాస్తుల నమోదు తీరుపై మీసేవ జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీ లు చేపట్టారు . అందులో భాగంగా గురువారం మునుగోడు, చిట్యాల, నార్కెట్ పల్లి మండలాల్లోని మీసేవ కేంద్రాల పని తీరు ను జిల్లా ఈడీఎం ఎండీ గఫార్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రెవేశ పెట్టిన ఆసరా పెన్షన్ల దరఖాస్తుల నమోదు తీరును నేరుగా పరిశీలించి సేవలందుతున్న తీరును అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా ఈడీ ఎం గఫార్ మాట్లాడుతూ 57 ఏళ్ళు నిండిన వారంతా ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులను మీ సేవ కేంద్రలో పూర్తిగా ఉచితంగా నమోదు చేస్తారని తెలిపారు. దరఖాస్తు దారులు తమ ఆధార్, ఓటర్ ఐడి కార్డులతో పాటు బ్యాంకు ఖాతా పుస్తకం వెంట తీసుకు రావాలని, ఆన్లైన్ అప్లికేషన్ నింపిన తర్వాత వేలిముద్ర అనుసంధానంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని, దరఖాస్తు దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.