Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయ ఆవరణలో పరిశుభ్రత లోపించడంపై మందలింపు
- రూ.8 లక్షలు దేనికి ఖర్చు చేశారో వారం రోజుల్లో లెక్కలు చెప్పాలని ఆదేశం
నవతెలంగాణ- మోత్కూరు
మండలకేంద్రాన్ని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కార్యాలయ ఆవరణ అపరిశుభ్రంగా ఉండడం, కార్యాలయంలో వసతులు, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తహసిల్దార్ షేక్ అహ్మద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి, చెత్తా చెదారం పేరుకుపోయి ఉండడంతో ఇది ఎమ్మార్వో ఆఫీసేనా, కార్యాలయం ఉండేది ఇలాగేనా, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇదంతా చూసి ఏమనుకుంటారని తహసిల్దార్‌ను మందలించారు. కార్యాలయంలో మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, కార్యాలయంలో ఉండాల్సిన వసతులు, ఫర్నిచర్ కనిపించడం లేదన్నారు. కార్యాలయానికి మంజూరైన రూ.8 లక్షల నిధులు ఏం చేశారని, నిధులను దీనికి ఖర్చు చేశారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. ఆ నిధులను దేనికి ఖర్చు చేశారు, ఏమేమి కొనుగోలు చేశారన్నది వారం రోజుల్లోగా పూర్తి లెక్కలు, వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్
డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణను మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్‌ను ఆదేశించారు. రోగులకు మంచి నీటి వసతి కల్పించాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లకు వెంటనే నీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పులు ఎక్కువగా చేస్తుండడంతో సిబ్బందిని అభినందించారు. కరోనా వ్యాక్సినేషన్ ఏవిధంగా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. కరోనా పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ఆస్పత్రిలో తగిన వసతులు కల్పించాలని, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సేవలందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ షేక్ అహ్మద్, డాక్టర్లు ఆకవరం చైతన్యకుమార్, జ్యోతి ఉన్నారు.
గుండాల మండలంలో కలెక్టర్ తనిఖీ
గుండాల: మండలంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి అధికారుల పని తీరు వివరాలను సేకరించారు. ఆస్పత్రిలో పరిసరాలను పరిశీలించి పనితీరులో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి రేజిస్టేషన్ కార్యాలయ సుందరీకరణ కోసం కేటాయించిన రూ.10 లక్షల వివరాలు తనకు అందజే యాలని ఆదేశించారు. జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఎండీ ఖలీల్ జిల్లా కలెక్టర్‌కు మండల సమస్యలను విన్నవిస్తూ ఇటీల మండలంలో దేవాదుల కలువ కోసం భూములు కోల్పోయిన రైతుల పట్టేదర్ పాసుబుక్కులలో భూములను తొలగించక పోవడంతో మండలం లో చాలా మంది రైతులకు రైతు బంధు జమ కాలేదన్నారు. ఆమె వెంట తహసీల్దార్్ దయాకర్ రెడ్డి, వైద్యాదికార శ్రీనివాస్ ఉన్నారు.