Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గతంలోనే పోలీసు అధికారుల పనితీరుపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా వారిలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. గ్రామాల్లో రైతుల భూముల తగదాల్లో తలదూర్చి ...తనకు నచ్చిన వారి కోసం ఇతరులను బండ బూ తులు తిట్టడం అలవాటుగా మారింది. ఇలాంటి వారిపై గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. అయినా వారి ధోరణిలో ఎలాంటి మార్పూ రాలేదు. గ్రామాల్లో నిత్యం కాయకష్టం చేసుకునే రైతులు పోలీసు అధికా రులు చేసే బెదిరింపులకు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
అన్నదమ్ముల భూతగాదలు...
నాంపల్లి మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన పొలగోని యాదయ్య, పోలగోని వెంకటయ్య, పోలగోని సత్తయ్యలు అన్నదమ్ములు. వీరి తండ్రి పోలగోని నర్సింహకు సర్వే నెంబర్ 88,86లో 18 ఎకరాలా 18 గుంటల భూమి ఉంది.ఆ భూమిని ముగ్గురు అన్నదమ్ములు కలిసి పంచుకున్నారు. గత కొన్నేండ్లుగా వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. అయితే ముగ్గురిలో రెండవ వ్యక్తి తన భూమిని ఇతరులకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. దీంతో మిగతా ఇద్దరు ఆ భూమిని గ్రామంలో ఉన్న ధర చెల్లించి తామే కొనుగోలు చేస్తామని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. ముగ్గురి మధ్య ఉన్న చిన్న చిన్న వ్యత్యాసాలను సరిచేసుకుని, అందరి పొలానికి రావడానికి అవసరమైన బాటను రిజిస్ట్రేషన్ చేసుకుందామని గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని వెంకటయ్య తిరస్కరించి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్ద ఫిర్యాదు చేశాడు.
సివిల్ తగదాలో తలదూర్చి బండబూతులు....
సివిల్ కేసుల్లో తలదూర్చొద్దని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ పదే పదే చెబుతున్నారు. కానీ మండల, డివిజన్ స్థాయిలో పనిచేసే అధికారులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చిన భూమిని సరిసమానంగా చూసుకుని అమ్ముకుంటే ఎవరికి ఇబ్బందీ లేదని గ్రామ పెద్దలు చెబుతుంటే, నాంపల్లి సీఐ మాత్రం దానికి విరుద్ధంగా వ్యక్తికి అండగా నిలిచి 'అలా కుదరదు... వినకపోతే అరెస్టు చేసి మక్కెలు ఇరగదన్ని జైలుకు పంపిస్తా... మీరు వచ్చే లోపు ఆ భూమిని అమ్మేస్తాం... లేదా మీ ఇద్దరు కూడా మేం చెప్పిన ధరకు మీ భూములు అమ్మితే కొనుగోలు చేయిస్తా'...అంటూ బండ బూతులు తిడుతున్నట్టు బాధితులు ఆరోపించారు. పోలగోని యాదయ్య, సత్తయ్యలకు సంబందించిన నీటిపైపులైన్ను వెంకటయ్య నరికి వేసాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేయకుండా అందరు తెలిసి దేవుడి గుడిలో ప్రమాణం చేయండి సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వడ్డేపల్లి గ్రామంలో గతంలో కూడా ఈ అధికారే సివిల్ పంచాయితీల్లో తలదూర్చి సామాన్యులను బెదిరింపులకు గురిచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తప్పుడు పనులు చేసే వాళ్లకు మద్దతు ఇచ్చి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే అధికారుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసాం
పోలగోని యాదయ్య, పోలగోని సత్తయ్య - వడ్డెపల్లి, నాంపల్లి మండలం
మా అన్నదమ్ముల భూమి పంచాయితీ విషయంలో నాంపల్లి సీఐ తలదూర్చి తమను బెదిరిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బూతుమాటలు తిడుతూ భయపెడుతున్నాడు. మేము చెప్పిన మాటలు కనీసం వినడంలేదు. మా వ్యతిరేకుల వద్ద లంచాలు తీసుకుని బెదిరిస్తున్నాడు. ఆయన మాటలకు భయపడి న్యాయం జరగదని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. సీఐతో మాకు ప్రాణభయం కూడా ఉంది. మాకు అన్యాయం జరిగితే ఆత్మహత్యే శరణ్యం. దానికి కారణం కూడా ఆ పోలీసు అధికారే కారణంగా చూపిస్తాం.