Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటిలాగే ప్రజా సమస్యలపై చర్చించని ప్రతినిధులు
పోడియం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు
తమ వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయట్లేదని చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్
మద్దతు తెలపని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
జిల్లా కేంద్రంలో నిర్వహించిన సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం రసాభాసగా ముగిసింది. ప్రజా సమస్యలపై సమావేశాల్లో చర్చించాల్సిన నాయకులు వాటిని గాలికొదిలేసి పార్టీలు, వ్యక్తిగత అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి తమ తమ వ్యక్తిగత కక్షలు, సమస్యలనే లేవనెత్తుతున్న కౌన్సిల్ సభ్యుల తీరుతెన్నులు స్థానిక ప్రజలను కలవర పెడుతున్నాయి. సమస్యలపై ప్రతి సమావేశంలో చర్చించాల్సిన అధికార పార్టీ కౌన్సిలర్లు అంతగా స్పందించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్ సభ్యులు అంతే దూకుడును ప్రదర్శిస్తూ సమస్యలను కనుమరుగు చేస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ వార్డు అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎలాంటి నిధులూ కేటాయించడం లేదని 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్ సమక్షంలో తన చెప్పుతో తానే కొట్టుకొని నిరసన తెలిపారు. అందరికీ సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన తెలుపుతున్నా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెడపక పోవడం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిల్ సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతకు ముందు కౌన్సిల్లో పొందుపర్చిన 40 ఎజెండా అంశాలను సభ్యులు ఆమోదించారు. పట్టణంలోని 48 వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులు చెపట్టేందుకు రూ.854.00 లక్షలు, సద్దుల చెరువు కట్టలో పైలాన్ ఏర్పాటుకు రూ.49 లక్షలు, సద్దుల చెరువు కట్ట పక్కన పార్క్ అభివృద్ధికి రూ.50 లక్షలు, 5,12,13 వార్డుల్లో స్మశాన వాటికల అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయించినట్టు ప్రకటించారు.
పట్టణాభివృద్ధికి మంత్రి కృషి : ఎంపీ బడుగుల
పట్టణాభివృద్ధికి మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎక్కడ నిధులు అవసరముంటే అక్కడ మంజూరు చేయిస్తామన్నారు. పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెల వారిగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో మీడియాకు అనుమతి ఇస్తున్నారని, మున్సిపల్ సమావేశాల్లో ఎందుకు నిషేధం విధించారో చెప్పాలని కోరారు. అన్ని వార్డులకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి.రామంజులరెడ్డి, వైస్ చైర్మెన్ పుట్టా కిషోర్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.