Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధ్యక్షుడి ఎన్నికలో ఐక్యతారాగం
కేటీఆర్‌ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
మానుకోటలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
నవతెలంగాణ-మహబూబాబాద్
వేగం తగ్గిన కారు దూకుడుకు ఇంధనం సమకూర్చడానికి జిల్లా అధ్యక్షుడిగా మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన కేఎస్ఎన్ రెడ్డి పేరును ఖరారు చేయడానికి అధిష్టానం సమాయత్తమవుతోంది. అసంతప్తి సెగలతో రగులుకున్న మానుకోట టీఆర్ఎస్లో ఐక్యతా రాగాన్ని పెంచేందుకు కేటీఆర్ సమయం కేటాయించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేటీఆర్‌కు కేఎస్ఎన్రెడ్డి ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పరిచయం చేశారు ఈ మేరకు ఆ ముగ్గురు కేఎస్ఎన్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో గులాబీ వాడిపోయే దశలో ఉన్నదని నాయకత్వం గుర్తించింది. ఇంతకాలం జిల్లా కమిటీలు లేకుండా పోయాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేలే సింగల్‌గా అన్ని కార్యక్రమాలు చక్కపెట్టారు. ఈ పరిస్థితి అసంతప్తికి వేదికగా మారిందని విమర్శలున్నాయి. సెప్టెంబర్ నుంచి సంస్థాగతంగా పార్టీని సంస్కరించడానికి ప్రక్షాళన దిశలో పార్టీ నాయకత్వం కార్యాచరణ ప్రకటించింది. అదే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా కేఎస్ఎన్ రెడ్డిని నియమించాలని టీఆర్ఎస్లోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, ఎంపీ మాలోత్ కవిత నిర్ణయించినట్లు సమాచారం. కేఎస్ఎన్ రెడ్డి సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అతడి తల్లి మహబూబాబాద్ పీఏసీఎస్ చైర్మెన్‌గా పని చేశారు. క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా తెలంగాణతోపాటు దేశ, విదేశాల్లో ప్రాజెక్టులు నిర్వహించారు. ప్రధానంగా 2009లో కాంగ్రెస్‌లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా మాలోతు కవిత గెలుపు విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో 2017లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా శంకర్‌నాయక్, ఎంపీగా మాలోత్ కవిత గెలుపులో కేఎస్ఎన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించారు. రెండు నియోజకవర్గాలతోపాటు ఇల్లందు, ములుగు నియోజకవర్గాల్లోని, మహబూబాబాద్ జిల్లాలోని మండలాల్లో కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గెలుపు కోసం కషి చేశారు. 2018లో జరిగిన ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులను రద్దు చేయగా కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించలేదు. జిల్లాకు టీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా కేఎస్ఎన్ రెడ్డి ఖరారు కానున్నారు. అంతేగాక ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వెన్నం శ్రీకాంత్‌రెడ్డి స్వగ్రామమైన రెడ్యాలకు చెందిన కేఎస్ఎన్ రెడ్డిని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుగా నియమించడం ద్వారా వెన్నం శ్రీకాంత్‌రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సంస్థాగత ఎన్నికల్లో వార్డు, గ్రామ, మండల కమిటీల అనంతరం జిల్లా అధ్యక్షుడిగా కేఎస్ఎన్ రెడ్డి పేరును ఖరారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.