Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం
రూ.5 లక్షల ఆస్తి నష్టం
ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
నవతెలంగాణ - సూర్యాపేట రూరల్
ఆస్తి కోసం ఏకంగా ఓ కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు కుట్ర చేసిన ఘటన మండలంలోని బాలెంల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల వివరాలు ప్రకారం..బాలెంల గ్రామానికి చెందిన చిట్యాల బాబూరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు కొంత కాలంగా దాయాదులతో భూ తగాదాలు నడుస్తున్నాయి. ఎలాగైనా బాబూరావు కుటుంబాన్ని అంతం చేస్తే భూమి మొత్తం తమకే దక్కుతుందని దయాదులు కుట్ర పన్నారు. ఈ క్రమంలో బాబురావు కుటుంబం మొత్తం అర్ధరాత్రి నిద్రిస్తుండగా దయాదులు ఆయన ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు గమనించిన బాబూరావు, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు పరుగులు పెడుతూ బయటికి వచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, రూ.45 వేల నగదు పూర్తిగా కాలి బూడిదయాయ్యి. ఈ ఘటనపై బాధితుడు సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎస్సై లవకుమార్ పట్టించుకోలేదని, పైగా ఇల్లు మీరే పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నారని తమపై ఆరోపిస్తున్నారని బాధితుడు తెలిపారు.
ఇల్లు పరిశీలన
విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు గురువారం కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఘటన జరిగిన 15 రోజులు కావస్తున్నా ఎస్సై లవకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించక పోగా, బాధితులను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ ఘటన విషయాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు.
కేసు దర్యాప్తు చేస్తున్నాం : ఎస్సై లవకుమార్
ఈ ఘటనపై ఎస్సై లవకుమార్‌ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.