Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ప్రజలపై భారం మోపుతున్న గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలోని బీటీఎస్ కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉజ్వల పథకం పేరుతో ఉచిత గ్యాస్ ప్రజలకు విరివిగా ఇచ్చిన వెంటనే గ్యాస్ ధరలు పెంచడం మొదలు పెట్టిందన్నారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలు చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో గ్యాస్ ధరలు ప్రజలకు గుదిబండగా మారాయన్నారు. గ్యాస్ కొనలేక మహిళలు కట్టెల పొయ్యి శరణ్యమని గ్యాస్ పక్కకు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. పొయ్యిమీద వాడకం అంటూ మళ్లీ వస్తే పొగతో మహిళలు అనారోగ్యానికి గురవుతారని గ్యాస్ కి వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తే కుటుంబ పోషణ భారంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి, సాబెర బేగం, మంజుల, ఉదయ, పద్మ, గాయత్రి, ఎల్లమ్మ, పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.