Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ -భువనగిరిటౌన్
75 ఏండ్ల భారతావనిలో మహిళలపైన రోజురోజుకు హత్యలు, లైంగికదాడులు పెరుగుతున్నాయని ఈ దాడులకు వ్యతిరేకంగా మహిళలు సంఘటితంగా పోరాడాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణకేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో ఆ సంఘం మండల రెండో మహాసభ అనాజిపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏదునూరి ప్రేమలత,అన్నంపట్ల బాలమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా ముందుకు పోతున్నా అడుగడుగునా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మనువాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నాయన్నారు. వినిమయ సంస్కతిలో మహిళలను ఒక విలాస వస్తువుగా చూస్తున్నారన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చినా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరవస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య మానవుడు కొనుక్కుని తినే పరిస్థితిలో లేరన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు మహిళల సంక్షేమం కోసం అనేక వాగ్దానాలు చేసి విస్మరించారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగికదాడులకు నిరసనగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 8వ తేదీన జిల్లా కేంద్రంలో ఐద్వా జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని, జయప్రదం చేయాలని కోరారు. జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ మాట్లాడుతూ పాలకులు మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్ రాసాల నిర్మల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొండమడుగు నాగమణి, నోముల జ్యోతి, ఎండి.నజీమా,కూకుట్ల చొక్కకుమారి, కొండాపురం బొందమ్మ, బొల్లెపళ్లి లీల, కొండ లక్ష్మమ్మ, మోదెల్ల బాలమ్మ, జక్కుల అండమ్మ, భారతమ్మ,బబ్బురి శంకరమ్మ,రాంపల్లి ఈశ్వరమ్మ,బుచ్చమ్మ, శమంత, నరాల కేతమ్మ పాల్గొన్నారు.