Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చేతులు మారిన రూ.2.10కోట్లు
అ ఒక్కో పోస్టుకు రూ.10లక్షల రేటు
అ 21 మంది నియామకాలు బ్రేక్
అ అధికారుల ఏకపక్ష నిర్ణయంతో మంత్రి సీరియస్ ..?
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్ట దేవస్థానంలో సుమారు 21 పోస్టులకు గాను ఆర్సీ నం ఎ2/429/2021లేఖ ద్వారా రెండు విడతల్లో ప్రకటించిన (గత నెల 5న, ఈ నెల 13న) తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని పలు నిబంధనలతో కూడిన దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవస్థానం ఇన్చార్జి ఈవో నోటిఫికేషన్ జారీ చేశారు. విడుదలైన నోటిఫికేషన్ మంత్రి నిలిపివేశారన్న సమాచారంతో...అసలు శాఖ కమిషనర్‌ను ఈ దేవస్థాన అధికారులు తప్పుదోవ పట్టించారా..? లేక అంత కలిసే నోటిఫికేషన్ విడుదల చేశారా..? మంత్రికి సమాచారం లేకుండా ఎవరి ప్రయోజనం కోసం...ఏమి ఆశించి నోటిఫికేషన్ విడుదల చేశారు..? ఇలా ఏకపక్ష నిర్ణయంతో అధికారులే నోటిఫికేషన్ జారీ చేయోచ్చా..? అనే కోణంలో స్థానికంగా చర్చ సాగుతోంది. ఈ దేవస్థానంలో స్థానాచార్యులు, పరిచారకులు, అర్చకులు, వంటస్వాములు (అన్నదానం, బ్రాహ్మణ సత్రం), శివాలయం అలాగే వాహన పూజలకు పరిచారిక, పురోహితుడు తదితర పోస్టులకు గాను అర్హులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
మంత్రికి తెలియకుండా...
ఇంత వరకు బాగానే ఉన్నా...సంబంధిత దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి అనుమతి ఈ నోటిఫికేషన్ విడుదలకు లేదని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కొంతమంది అభ్యర్థులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకుపోగా తక్షణమే నోటిఫికేషన్ నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే....నోటిఫికేషన్ విడుదల అయ్యిందనే ఉత్సాహంలో ఇక నియామకాలే తరువాయి అని భావించిన కొందరు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల సహకారంతో ఒక్కొక్క అభ్యర్థి నుండి 10లక్షలు వసూలు చేశారని యాదగిరిగుట్ట ప్రజలు కోడైకూస్తున్నారు. అంటే 21 పోస్టులకు గాను రూ.2కోట్లా10లక్షలు చేతులు మారినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పుడు నియామకాలు నిలిచిపోవడంతో టెబుల్ కింద చేతులు పెట్టిన ప్రబుద్దుల పరిస్థితి కుడితిలో పడ్డా ఎలుకల మారింది. పూజారుల నియామకం కోసం ఇంత పెద్ద మొత్తంలో చేతులు మారడం ఇప్పుడు యాదగిరిగుట్టలో సంచలనంగా మారింది.
గతంలోనూ ముడుపులు
గతంలో ఇక్కడ అవకతవకలు జరిగినట్టు కూడా ఒక ఆడియో రికార్డు బయట పడింది. ఒక పోస్టు కోసం సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టాయని అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఆ లీక్‌కు కారణమైన ఒక ఉద్యోగికి రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేసి అధికారులు తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేయడం ఇక్కడ కొత్తేమి కాదు. ఈ దేవస్థానంలో జరిగే నియామకాలతో పాటు ఉద్యోగ, సిబ్బంది అంతర్గత బదిలీల్లో కూడా లంచాలు పుచ్చుకోవడం ఎప్పుడు ఇక్కడ అత్యంత రహస్యంగా జరిగే పనే. ఇలాంటి అవకతవకలు ఇక్కడి దేవస్థానంలో ఎన్నో జరుగుతుంటాయి.
వారి అనుయాయులకే అవకాశాలు
అధికారుల బందు, మిత్రులకు లేదంటే వారి అనుయాయులకు (అంటే ఉద్యోగ, సిబ్బంది) ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం తెరచాటు బాగోతం జరుగుతుండటం విశేషం. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన నియామకాలను పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ అంశాలు బహిర్గతమవుతాయని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాగా భజనపరులకు అంతర్గత బదిలీల్లో కూడా ఇక్కడ భలే అవకాశాలు వరిస్తాయని టాక్. లేదంటే అప్రధాన్యత పోస్టులకే పరిమితం కావాల్సి ఉంటుందని పలువురు ఉద్యోగులు పలు సందర్భాల్లో ఆవేదన చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక అనుకూలంగా ఉండే ఉద్యోగ, సిబ్బంది పొరపాట్లు జరిగితే సుతిమెత్తగా తప్పించడం...ప్రతికూలంగా ఉన్న ఉద్యోగ, సిబ్బందిని వ్యక్తిగత ఈర్ష్యతో బలిపశువులను చేయడం ఇక్కడ శరమామూలుగా జరుగుతున్న తంతే. విధి నిర్వాహణలో ఇక్కడి అధికారులు పక్షపాత దోరణి ప్రదర్శిస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. తరచు ఈ దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై పక్షాళన జరగాలని స్థానిక భక్తులు అభిప్రాయపడుతున్నారు.
సెలక్షన్ కమిటీి రాకనే ఇంటర్వ్యూలు ప్రారంభించలేదు
ఇన్చార్జి ఈవో గీత
కమిషనర్ కార్యాలయం నుండి సెలక్షన్ కమిటీ ఇంకా రాలేదు..అందుకే ప్రారంభించలేదు. తాత్కాలికంగా నిలిచిపోయిన ఇంటర్వ్యూలను కమిటీ వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. కమిటీి నిర్ణయం మేరకే అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు జరుపుతాం.