Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు
చెరుపల్లి సీతారాములు
యాదాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, అనేక నియంతలను మట్టికరిపించిన చరిత్ర ప్రజలకు ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టిందన్నారు. ఇప్పటికే రైల్వే బీమా పోస్టల్,ఓడరేవులు,విమానయాన రంగాలను కార్పొరేట్ రంగాలకు అమ్మివేసిందన్నారు. మరోపక్క ప్రజలకు చేరువగా ఉన్న ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేసిందన్నారు. దేశంలో ఒకవైపు కరోనా వచ్చి 10 లక్షల మంది చనిపోయారన్నారు ఇప్పటికీ ఇంకా కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు 34 శాతం మందికి రెండవ డోసు కేవలం 10శాతం మందికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు 35 వేల కోట్లు కేటాయించడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు ప్రభుత్వ వైద్య రంగానికి బడ్జెట్లో కనీసం 2 శాతం నిధులు కూడా కేటాయించలేకపోతున్నారని విమర్శించారు దేశ రైతాంగాన్ని దెబ్బతీసేందుకు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేవిధంగా దొడ్డి దారిన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల సాగు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగాన్ని నిర్ములిస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల పోరాటాలవల్ల సాధించుకున్న ఉపాధి హామీ పథకం ను నిర్వీర్యం చేసే పనిలో బీజేపీ ప్రభుత్వం పడిందన్నారు. ఆ చట్ట రక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, అర్హులందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయకష్ణ, దయ్యాల నర్సింహా, సిర్పంగి స్వామి, నాయకులు వనం రాజు, అన్నంపట్ల కష్ణ,ఎదునూరి మల్లేశం, గునుగుంట్ల శ్రీనివాస్, సిల్వేరు ఎల్లయ్య, బీమగాని రాములు, మాధవి, అబ్దుల్తాపురం వెంకటేష్, చింతల సుబ్బారెడ్డి, తంటం వెంకటేశ్,వడ్డేబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.