Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరాటాల ద్వారా ప్రతిఘటించాలి
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి వారిపై మరింత భారం వేయడం సరికాదన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేయడం కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థను, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని బలహీన పరిచే విధంగా తెచ్చిన మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా తెచ్చిన లేబర్ కోడ్లనూ రద్దు చేయాలన్నారు.
ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థలను బలహీన పరుస్తూ రైల్వే, విమానయానం, ఎల్ఐసీ, రవాణా లాంటి సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్మేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, దండా వెంకట్‌రెడ్డి, జె.నర్సింహారావు, జిల్లా నాయకులు వీరబోయిన రవి, ఆవిరె అప్పయ్య, కొప్పుల రజిత, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, చిన్నపంగి నర్సయ్య, బత్తుల వెంకన్న, వల్లపుదాస్ సాయి కుమార్, మొకర్ల వెంకన్న, షేక్ జహంగీర్, నందిగామ సైదులు, మమత, రామతార సునీత, నగిరి వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.