Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీకాంత్వర్మ
నవతెలంగాణ - సూర్యాపేట
రాష్ట్రంలో విద్యారంగం భ్రష్టుపట్టిందని.. ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతుందని వాస్తవాలు మాట్లాడిన జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్రెడ్డిపై చర్యలు తీసుకోవడం సిగ్గు చేటని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రలో ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలు, చర్యలు తీసుకోవడం వంటి ఘటనలు ఎక్కువయ్యాయని అన్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలను బలోపేతం చేస్తుందన్నారు. రేషనలైజేషన్ పేరుతో సుమారు 4000 పాఠశాలను తెలంగాణ ప్రభుత్వం తీసి వేస్తుందన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు అధికారులపైనా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రేమ్ కరణ్రెడ్డిని యథాస్థానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు కొండా అజరు, వినరు, ప్రసాద్, ప్రేమ్, గోపీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.