Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కుంట నిండితే నీట మునుగుతున్న బాట
అ వ్యవసాయ బావులకు వెళ్లేందుకు
రైతుల అవస్థలు
అ పట్టించుకోని నీటి పారుదలశాఖ అధికారులు
కాంట్రాక్టర్ చేసిన అసంపూర్తి పనులు.. అధికారుల పర్యవేక్షణ లోపంతో వానాకాలంలో ఓ కుంటనిండినప్పుడల్లా వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే బాట (రోడ్డు) నీట మునుగుతుండటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆ కుంట మరమ్మతు, అభివద్ధి పనులు చేసిన సదరు కాంట్రాక్టర్ తూములు ఏర్పాటు చేయలేదు. వానాకాలంలో ఆ కుంట పూర్తిగా నిండి నీరు బయటకు వెళ్లక రోజుల తరబడి బాట నీటిలో మునిగి పోతుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంలోని అవుసలివానికుంట మరమ్మతు, అభివద్ధి పనులకు సుమారు రెండేండ్ల క్రితం మిషన్ కాకతీయ ఫేజ్ -3లో నిధులు మంజూరయ్యాయి. కుంట పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ కుంట కట్ట సుమారు 500మీటర్లుకు వరకు మట్టి పోసి చదును చేశారు. కట్టకు ఒకవైపు బండ రాళ్లతో రివిట్మెంట్ చేశారు. కుంట అవతలి వైపున ఉన్న పొలాలకు రైతులు ఆ కట్టపై నుంచే వెళుతుంటారు. రివిట్మెంట్ పనులు కూడా నాణ్యతగా చేయకుండా చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుంటకు గతంలో మూడు చోట్ల తూములు ఉండగా పనులు చేసిన సదరు కాంట్రాక్టర్ కొత్తగా తూములు పెట్టకుండా ఉన్న వాటిని మూసివేశారు. దీంతో కుంటలోకి భారీగా వరద నీరు వచ్చి పూర్తిగా నిండి తూములు లేక నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో కుంటను ఆనుకుని ఉన్న మోత్కూరు -మోదుబాయిగూడెం రోడ్డు ఐదారు ఫీట్ల లోతు నీళ్లు నిలిచి మునిగిపోతుందని రైతులు వాపోతున్నారు. కుంటలో నీరు తగ్గే వరకు రాకపోకలు నిలిచిపోతుండటంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లలేకపోతున్నామని, పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తోలుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూములు పెట్టకపోవడంతో కుంట కింద ఉన్న పోలాలకు సాగునీరు కూడా అందడం లేదంటున్నారు.
కుంట రికార్డుల్లో ఉన్నట్టా..లేనట్టా..?
అవుసలివాని కుంటకు సంబంధించిన సమాచారం కోసం నీటి పారుదలశాఖ అధికారులను వాకబు చేయగా ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెబుతున్నారు. రికార్డుల పరంగా తన వద్ద సమాచారం ఉండదని, తాను కేవలం ఫీల్డ్ విజిట్ మాత్రమే చేస్తానని ఓ అధికారి చెబుతుండగా, మోత్కూరు మండలానికి సంబంధించి తనకు ఇచ్చిన చెరువులు, కుంటల రికార్డుల్లో అవుసలివాని కుంట సమాచారం లేదని మరో అధికారి చెప్పారు. నీటి పారుదలశాఖకు సంబంధించి మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సబ్ డివిజన్ పరిధిలో ఉండటంతోనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అధికారులు కూడా మాటిమాటికి మారుతుండటంతో సరైన అవగాహన ఉండటం లేదంటున్నారు. కుంట పనులు మిషన్ కాకతీయ ఫేజ్-3లో చేశారని, ఏఎంవోలో బిల్లు పెండింగ్‌లో ఉందని నీటి పారుదలశాఖ ఇన్‌చార్జ్జి ఏఈ అమర్ కుమార్ తెలిపారు. కుంటకు సంబంధించిన కచ్చితమైన సమాచారం మాత్రం ఏ అధికారి చెప్పడం లేదు. ఏదేమైనా కుంటకు తూములు ఏర్పాటు చేసి తమ ఇబ్బందులను తొలగించాలని రైతులు కోరుతున్నారు.
తూములు ఏర్పాటు చేయాలి
ఎడ్ల పక్కీరు, రైతు, మోత్కూరు
అవుసలివాని కుంటకు గతంలో మూడు చోట్ల తూములు ఉండేవి. కుంట మరమ్మతు పనులు చేసిన కాంట్రాక్టర్ తూములు ఏర్పాటు చేయలేదు. తూములు లేకపోవడంతో కుంట కింద ఉన్న పొలాలకు సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి తూములు ఏర్పాటు చేయాలి.
బావుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నాం
నల్ల ప్రభు, రైతు, మోత్కూర్
కుంట పూర్తిగా నిండిన సమయంలో రోడ్డు నీట మునుగుతుండటంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గతేడాది వానాకాలంలో చాలా రోజులు నీళ్లు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే కుంట పూర్తిగా నిండింది. ప్రస్తుతం కురుస్తున్న వానలతో మళ్లీ రాకపోకలు నిలిచియే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్పందించి కుంటకు తూములు పెట్టి ఇబ్బందులను తొలగించాలి.
తూములు ఏర్పాటు చేయిస్తాం
ుఎం.సత్యనారాయణగౌడ్, ఐబీ డీఈఈ, తిరుమలగిరి సబ్ డివిజన్
అవుసలివాని కుంటకు తూములు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటాం. కుంటకు తూములు ఏర్పాటు చేయలేదన్న విషయం మా దష్టికి రాలేదు. ఏఈని ఫీల్డ్ విజిట్‌కు పంపించి నివేదిక తెప్పించుకుంటాం. కుంటకు సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటాం.