Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మండలంలోని గణపవరం వాగు వద్ద ఆర్అండ్బీ రోడ్డుకు పడిన గండిని వెంటనే పూడ్చి రాకపోకలను పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం వాగు వద్ద ధర్నా నిర్వహి ంచారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో గండి పడి రోడ్డు తెగిపోవటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గండి పడిన ప్రదేశాన్ని కనీసం ప్రభుత్వ అధికారులు సందర్శించక పోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 6న కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్టు గుర్తు చేశారు. గండి పడడంతో మునగాల నుంచి కీతవారిగూడెం వరకు సుమారు 40 గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కూడా రోడ్డుకు పడిన గండిని నేటి వరకూ సందర్శించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గండిని పూడ్చి రోడ్డును బాగు చేయించి రాకపోకలను పునరుద్ధరింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, మండల కార్యదర్శి దేవరం వెంకట్కరెడ్డి, కొక్కిరేణి సింగిల్ విండో చైర్మెన్ చందా చంద్రయ్య, నాయకులు నందిగామ సైదులు, చందా శ్రీను, నబీసాహెబ్, చిన్న సైదులు తదితరులు పాల్గొన్నారు.