Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నగరంలో ఆరేపల్లి, కొత్తపేట, ఎనుమాముల గ్రామాల పరిధిలో 'కుడా' ఆధ్వర్యం లో రహస్యంగా భూముల సర్వే చేపట్టారు. ఈ విషయం గ్రహించిన రైతులు పెద్ద ఎత్తున నిరసన లకు దిగిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం తన విధానంలో భాగంగానే 'ల్యాండ్ పూల్' ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలిదశలో 5 వేల ఎకరాలు, మొత్తంగా 15 వేల ఎకరాలను గుర్తించి ల్యాండ్ పూల్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 'కుడా' అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే గ్రేటర్ వరంగల్ నగరంలో భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు గడించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో హెచ్ఎండిఎ సైతం ఇదే పద్దతిని అవలంభించి భూములను వేలం వేసి కోట్లాది రూపాయలను ఆర్జించిన విషయం విదితమే. ఇదే క్రమంలో హెచ్ఎండిఎ తరహాలనే 'కుడా' ల్యాండ్ పూల్‌కు భూములను గుర్తించే పనిలో పడింది. ఆరేపల్లి, కొత్తపేట ప్రాంతాల్లోని భూములు సారవంతమైన భూములు కావడం, రెండు పంటలు పండేవి కావడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. ఈ విషయంలో 'కుడా' అధికారులు, జిల్లా కలెక్టర్ మాట మారుస్తున్న పెద్ద ఎత్తున భూములను సేకరించి 'రియల్' వ్యాపారం నడపడానికి రంగం సిద్ధమైందన్నది యధార్ధం.
గ్రేటర్ వరంగల్ నగర శివారులో ల్యాండ్ పూల్ కోసం 'కుడా' అధికారులు పైడిపెల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోని ఆరేపల్లి, కొత్తపేట, ఎనుమాముల, మొగిలిచర్ల గ్రామాల భూములను రహస్యంగా సర్వే చేశారు. ఈ విషయం రైతులకు తెలియకపోవడం గమనార్హం. 'కుడా' అధికారులు మాకు తెలియకుండానే మా భూములను సర్వే చేయడమేంటని ఆగ్రహించిన రైతులు రాఖీ పర్వదినం నాడు రోడ్డెక్కి పత్తి మొక్కలకు రాఖీలు కట్టి నిరసన తెలిపిన విషయం విదితమే.
రహస్య సర్వే ఆంతర్యం
ల్యాండ్ పూలింగ్‌కు సేకరించే భూములకు సంబంధించి భూమి యజమానులతో చర్చించి, వారు అంగీకరిస్తే 'కుడా', రైతుల మధ్య 50-50 వాటాగా వుంటుంది. ఆరేపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులకు తెలియచేయకుండానే అధికారులు రహస్య సర్వే నిర్వహించడం రైతుల్లో ఆందోళనను పెంచింది. ఇలా సేకరించిన భూములకు సంబంధించి భూ మార్పిడి, లే అవుట్, ఫెన్సింగ్, అభివృద్ధికి సంబంధించి నిధులను 'కుడా' మాత్రమే భరిస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఇలా అభివృద్ధి చేసిన లే వుట్‌లో నుండి ఎకరానికి దాదాపు 1,500 గజాల ప్లాట్లు ఆ భూ యజమానికి వస్తుంది. ఇలా తయారు చేసిన ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో మార్కెట్ ధర కంటే రెండింతల ధరతో విక్రయిస్తారు.
ఆజాంజాహి మిల్లు భూముల్లో గతంలో 'రియల్' వ్యాపారం
గతంలో వరంగల్ ఆజాంజాహి మిల్లు భూముల్లో 'కుడా' రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. 2007లో ఓ సిటీ పేరుతో 120 ఎకరాలను లే అవుట్ ప్లాట్లుగా చేసి వేలం వేసి విక్రయించింది. 2010లో హసన్‌పర్తి మండలం మడిపల్లిలో 200 ఎకరాలను సేకరించి లే అవుట్ చేసి వేలం వేసి విక్రయించి డబ్బులు సంపాదించింది.
ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోనే..
'కుడా' సేకరించే ల్యాండ్ పూల్ భూములను వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోనే గుర్తించాలని భావిస్తున్నారు. ఎనుమాముల మార్కెట్ వెనుక, కొత్తపేట, పైడిపల్లి, ఆరేపల్లి, వంగపహాడ్, దామెర, హసన్ఫర్తి, దేవన్నపేట, సోమిడి, రాంపూర్, భట్టుపల్లి, మొగిలిచర్ల, ధర్మారం, పోతరాజుపల్లి, స్తంభంపల్లి, వసంతపూర్, కోట వెంకటాపురం, గాడిపల్లి, నక్కలపల్లి, బొల్లికుంట, మామునూరు, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, ఉనికిచర్ల, టేకులగూడెం, ధర్మసాగర్, ఎల్కుర్తి, వనమాల కనపర్తి, తరాలపల్లి తదితర గ్రామాల్లో భూములను సేకరించనున్నారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి..
రైతులు అంగీకరిస్తేనే భూములు తీసుకుంటామని 'కుడా' అధికారులు చెప్పడం గమనార్హం. అదే వాస్తవమైతే సంబంధిత రైతులకు చెప్పి సర్వే చేయొచ్చు. రైతులకు చెప్పకుండా సర్వే చేయాల్సిన అవసరం ఏమిటీ ? అనే ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో నిధులను సమీకరించే ఉద్ధేశంతో నగరాల్లో ల్యాండ్ పూల్‌ను ఏర్పాటు చేసి భూములను సేకరించి వ్యాపారం చేసి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తుంది. ఇందుకు సారవంతమైన భూములను సర్వే చేయడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఆరేపల్లి రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో తాత్కాలికంగా సర్వేను నిలిపివేశారు. పంట కోతకాలం అనంతరం మళ్లీ సర్వేను చేపట్టే అవకాశం లేకపోలేదు.