Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 40ఏండ్ల కింద ఎమ్మెల్యే రాఘవరెడ్డిి
కేటాయించిన దుకాణాలు
అ అద్దె చెల్లిస్తున్నా గెంటివేసే ప్రయత్నం
అ మానవత్వం చూపని మున్సిపాలిటీ అధికారులు
అసలే వారంతా పేదలు... చిరువ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇదే వృత్తిని 40ఏండ్లుగా ఎంచుకుని జీవిస్తున్నారు. పట్టణం నడిబొడ్డ్డున కేంద్రంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అక్కడ ఉచితంగా వ్యాపారం చేసుకోవడంలేదు. గ్రామపంచాయితీ చెప్పినట్టుగా అద్దె చెల్లిస్తున్నారు... అయినా ఈ మధ్య వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అర్ధాంతరంగా వెళ్లగొడితే తామెట్ల జీవించాలనే ఆవేదనలో చిరువ్యాపారులున్నారు. తమకు ప్రత్యామ్నయం చూపించండి లేదా కిరాయి పెంచైనా సరే షాపులు మాకే ఇవ్వండి అంటూ వారంతా ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. కానీ కోర్టు తీర్పు పేరుతో బయటికి పంపించేలా అక్కడ పాలకులు కుట్ర చేస్తున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నకిరేకల్ ప్రధాన సెంటర్ మొదలైన నాటి నుంచి అక్కడ చిరువ్యాపారులు కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు. అదేచోట ఆ కాలంలో బస్టాప్ కూడా అదే. ఇదంతా సుమారు 45ఏండ్ల కింది నాటి మాట.. అయితే వారంతా గుడిసెలు వేసుకుని వ్యాపారులు చేసుకునేవారు. ఇక్కడ జీవిస్తున్న నిరుపేదలపై కొంత మంది కక్షగటి ఆ గుడిసెలకు నిప్పు పెట్టిన సంఘటనలు కూడ ఉన్నాయి. అలాంటి సంఘటనలు దాదాపు నాలుగు సార్లు జరిగినట్లు బాదితులు పెర్కొంటున్నారు.
నర్రా రాఘవరెడ్డి కేటాయింపు
గుడిసెలు కాలిపోతుంటే బాధితులంతా తమపై ఎవరో కక్షగట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదనతో నాటి నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లగక్కారు.అప్పుడు ఆయన స్వంతంగా తాత్కాలికంగా షాపుల నిర్మాణం చేసుకుంటే మంచిదని వారికి సలహా ఇచ్చి వారిని ఎవరూ కూడా ఇబ్బందులు పెట్టొద్దదని అధికారులకు సూచించారు. దాంతో నాటి గ్రామ పంచాయతీ అధికారులు తమ ప్లానింగ్ ప్రకారం షాపుల నిర్మాణం చేసుకుంటే మంచిదని ఫ్లాన్ వేసి ఇచ్చారు. దాని ప్రకారమే వాళ్లంతా 1996సం||రంలో సుమారు రూ.50వేలు సొంత డబ్బులతో దాదాపు 37 మంది షాపుల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. 1998లో గ్రామపంచాయతీతో అగ్రిమెంట్ చేయించుకున్నారు. నిర్ణయించిన మేరకు 10ఏళ్ల వరకు నామమాత్రం కిరాయి చెల్లిస్తూ వ్యాపారం చేసుకుని 10ఏండ్ల తర్వాత షాపులను ఖాళీ చేసి పంచాయతీకి అప్పజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
2008 గ్రామపంచాయతీ తీర్మానం
షాపుల అగ్రిమెంట్ కాలం పూర్తయిన తర్వాత వాటిని ఖాళీ చేయాలని పంచాయతీ అధికారులు వ్యాపారులను ఒత్తిడి చేయగా వాళ్లంతా కిరాయి అదనంగా చెల్లిస్తాం... మాకే కేటాయించండి అంటూ విన్నవించగా మోజార్టీ గ్రామపంచాయతీ సభ్యులు అపుడు షాపులలో ఉంటున్న వ్యాపారులకే అద్దె అదనంగా పెంచుతూ అప్పగించాలని తీర్మానం చేశారు. కానీ ఈ తీర్మానం నాటి సర్పంచ్‌కు నచ్చలేదు. అందుకే కోర్టులో కేసు వేసినట్టు తెలిసింది. అయితే వ్యాపారులు మాత్రం ప్రతి నెల కిరాయి ఏ నెలకు ఆ నెల చెల్లిస్తామని, అదనంగా పెంచిన కిరాయి సొమ్మును డీిడీ రూపంలో పంచాయతీ అధికారులకు అందజేశారు. ఆ మేరకు 2008 నుంచి 2018 వరకు ఇలాగే షాపులు నిర్వహించుకున్నారు. ఈ పదేండ్ల కాలంలో కోర్టుకు కేసు నడిపించారు. వ్యాపారులంతా ముగ్గురు వ్యక్తులను ఎంపిక చేసుకుని వారి ద్వారా కోర్టుకు హాజరయ్యేలా నిర్ణయించుకున్నారు. వీటి కోసమే సుమారు 30లక్షల వరకు వ్యాపారులంతా డబ్బును పోగుచేసుకుని ఖర్చులు పెట్టినట్టు తెలిసింది. అయితే చివరకు హైకోర్టు షాపులను బహిరంగ వేలం వేయాలని తీర్పు చెప్పినట్టుగా సమాచారం. అదే సందర్బంలో వరుస ఎన్నికలు రావడం... గ్రామపంచాయతీ నుంచి మున్సిపల్‌గా మారడం జరిగింది. గ్రామపంచాయతీ నుంచి నకిరేకల్ మున్సిపాలిటీగా మారడంతో కోర్టు తీర్పును అమలు చేయడం పట్ల కొంత ఆలస్యం జరిగింది. దీంతో ఓ వ్యక్తి కోర్టు తీర్పును అమలుచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్టు మరోక పిటిషన్ వేసారని తెలిసింది. అప్పుడు కోర్టు సీరియస్ కావడం వల్ల మున్సిపల్ అధికారుల షాపుల వేలం పాటకు చర్యలు తీసుకుంటున్నారు.
చిరువ్యాపారుల ఆవేదన...
దాదాపు 40ఏండ్లకు పైగా ఇక్కడే చిరువ్యాపారం చేసుకంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. దాదాపు మా రెండోతరం కూడ ఇదే షాపులలో వ్యాపారం చేస్తున్నారు. మాకు జీవించడానికి మరో ఆధారం లేదు...అందుకే ఈ షాపులు వేలం పాట గాకుండా మాకే కేటాయించండి... అద్దె ఎంత పెంచినా చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నమంటూ మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధుల కాళ్లవేళ్ల పడుతున్నారు. కానీ ఎవరూ కూడా వారి పట్ల కనికరం చూపిండంలేదు. మున్సిపల్ అధికారులు నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోవాలనే పదే పదే హుకూం జారీచేస్తున్నారు. నాడు పెద్దమనుషులుగా షాపుల కేటాయింపుపై చిరువ్యాపారుల కోసం తిరిగిన నేతలంతా నేడు అధికార పార్టీలో కొనసాగుతున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి చిరువ్యాపారులకే కేటాయించేలా చూడాలని బతిమిలాడుతున్నప్పటికి ఎవరూ కూడా కనీసం స్పందన లేదని తెలుస్తుంది. ఇపుడు ఎక్కడా... ఎలా వ్యాపారులు చేసుకోవాలే.. కుటుంబాలను ఎలా పోషించుకోవాలనే తీవ్ర ఆందోళనలో వ్యాపారులంతా ఉన్నారు.
డబ్బులు తీసుకుని మర్చిపోయారు
-చంద్రగిరి లింగమ్మ, చిరువ్యాపారి నకిరేకల్
షాపులు మాకే కేటాయించేలా చూస్తామని ముగ్గురు వ్యక్తులు కలిసి మా వద్ద డబ్బులు వసూలు చేశారు. కానీ అసలు పని పక్కకు పెట్టారు. సుమారు రూ.28లక్షలు వసూలు చేసిండ్రు. 40ఏండ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నం ఇపుడు ఎక్కడికిపోవాలే... మమ్మల్ని రోడ్డున పడేస్తున్నారు.. ఇది న్యాయమేనా... తీసుకున్న డబ్బులు ఏమైనవంటే ఖర్చయినవని చేతులు దులుపుకుంటున్నారు.
కనీసం సమయం ఇవ్వమని అడిగితే కూడా వినడంలేదు
-ఆరిఫోద్దిన్, చిరువ్యాపారి, నకిరేకల్
షాపులు ఖాళీ చేయమని మున్సిపల్ కమిషనర్ బాగా ఒత్తిడి తేస్తుండు. కనీసం సమయం కూడా ఇవ్వడంలేదు. సామాను పూర్తిగా బయటపడేస్తుండు... పెద్ద మనుషులు షాపుల సమస్యను తీర్చడానికి డబ్బులు లక్షల్లో వసూలు చేశారు.. కానీ ఏ పని చేయడంలేదు.