Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
నవతెలంగాణ-వేములపల్లి
మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధికారుల నియామకంలో స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల దందా కొనసాగుతోంది.నియోజకవర్గంలో మండలంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని మండల పరిషత్ అధికారులుగా నియమించుకోవడం కోసం నిబంధనలు తుంగలో తొక్కి అధికార బలం ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా వారిని విధుల్లో చేరేలా ఆదేశాలు ఇస్తున్నారు.వేములపల్లి మండలకేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న మండల పరిషత్ అధికారి మే నెలలో సెలవుపై వెళ్లారు.నాటి నుండి నేటి వరకు ఈవోఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తి ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి ఎంపీడీఓ పలు ఆరోపణలు రావడం,మండల పరిషత్ అధికారి లేకపోవడంతో బదిలీల్లో భాగంగా నల్లగొండలో డీఆర్డీఏ ఈఓగా పనిచేస్తున్న ఇందిరను మండల పరిషత్ అధికారిగా వేములపల్లి బదిలీ చేశారు. శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం డిప్యుటేషన్‌పై మిర్యాల గూడ మండల పరిషత్ అధికారిగా వెళ్లారు.మిర్యాలగూడ మండల పరిషత్ అధికారిగా రెండున్నరేండ్లుగా చేస్తున్న దేవిక వేములపల్లి మండల పరిషత్ అధికారిగా డిప్యూటేషన్‌పై మండల పరిషత్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ అధికారుల నియామకంలో అధికార పార్టీ దందా కొనసాగుతుందని సమాచారం.జిల్లా అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ప్రభుత్వఅధికారులను సర్దుబాటు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేసుకుని తమ పనులు సాఫీగా చేసుకుంటు న్నారని,వారి ఆదేశాలకు లోబడి ఉండాలని అధికారులను హెచ్చరిస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు దష్టి సారించకపోవడం శోచనీయం.బదిలీపై వెళ్లిన అధికారులను అధికార పార్టీ నాయకులు శాసించడం సరి కాదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.