Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు.సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని,సాగుదారులపై నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్షాల పోరాట ఫలితంగా 2006 లో అటవీ హక్కుల చట్టం వచ్చిందన్నారు.వచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఆదివాసీ, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులకు పాల్పడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.అనేక పోరాటాలు చేసి ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని, అలాగే అనేక రక్షణచట్టాలను సాధించుకోవడం జరిగిందని,వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు.సూర్యాపేట జిల్లా లోని మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం,పాలకీడు మండలంలో 25 వేల ఎకరాలకు పైగా పోడు భూములు ఉన్నాయని,వాటిని గిరిజనులకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడం వలన ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, పంట రుణాలు, రుణమాఫీ వంటివి వీరికి అందడం లేదన్నారు. మరోపక్క పంటలను అమ్ముకునే సందర్భంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.పోడు భూములు మొక్కలు నాటడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.రెవెన్యూ ,ఫారెస్ట్ సరిహద్దు వివాదంలో ఉన్న భూములపై జాయింట్ సర్వే చేసి ఆ భూముల గిరిజనులకు అప్పగించి ఇవ్వాలన్నారు. అభివద్ధి పేరుతో షెడ్యూల్ ఏరియాలో ఉన్న భూములను సేకరించవద్దని కోరారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అటవీ శాఖ జిల్లా అధికారి ముకుందరెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకట్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పాముల సీతారాములు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ములకలపల్లి సైదులు పాల్గొన్నారు.