Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యకాస ఆధ్వర్యంలో అటవీశాఖ
కార్యాలయం ఎదుట ధర్నా ధర్నా
నవతెలంగాణ - భువనగిరి
పోడు, డిఫారెస్ట్ భూములను సాగు చేసుకుంటున్న సాగు దారులపై నిర్బంధాలు ఆపేసి, హక్కు పత్రాలు, నూతన పట్టాదారు పాస్‌బుక్కులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రొడ్డ అంజయ్య, కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులను నమ్ముకుని గిరిజనులు, పేదలు అనేక మంది జీవిస్తున్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అటవీ సంపదను పరిరక్షిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేప,ీ రాష్ట్రంలోని టీిఆర్‌ఎస్ ప్రభుత్వాలు అడవుల నుండి గిరిజనులను, పేదలను తరిమేసి అటవీ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో 'అటవీ హక్కుల చట్టం2006' వచ్చిందని, ఈ చట్టం రూపొందించడంలో వామపక్షాలు, టీఆర్ఎస్ సహా 17 పార్టీలు భాగస్వాములయ్యాయని , చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పారు. అప్పుడు గొప్ప చట్టం అని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఇది తలాతోక లేని చట్టం అని తూలనాడటం దేనికి సంకేతమనివిమర్శించారు.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడు సాగుదార్లందరికీ ఆరు నెలల్లో పట్టాలిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. భూములు సాగుచేసుకుంటున్నవారిపై ఫారెస్టు అధికారులు దాడులు చేయడం, కేసులు పెట్టి వేధించడం, జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలకు పైగా పోడు వ్యవసాయం చేస్తూ రెండు లక్షల పైగా పోడు రైతులు అటవీ హక్కు పత్రాల కోసం వానికి దరఖాస్తు చేసుకోగా కేవలం లక్ష మందికి 5 లక్షల ఎకరాల భూమికి పట్టా ఇచ్చారన్నారు. మిగతా లక్షమందికి ఎనిమిది లక్షల ఎకరాల భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సల్లూరి కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు జూకంటి పౌలు, గంగా దేవి సైదులు, కమిటీ సభ్యులు దొడ్డి బిక్షపతి, కొండాపురం యాదగిరి, రాపోలు నర్సిరెడ్డి, నాయకులు బొల్లెపల్లి కిషన్, తీగల వెంకటేష్, మధ్యబొయిన ఉప్పలయ్య, బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.