Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
అ దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరణ
అ ముషంపల్లి ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో మహిళపై లైంగికదాడి, హత్య జరిగిన ఘటన అమానుషమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. గురువారం జిల్లా కేంద్రప్రభుత్వా చేరుకున్న ఆయన మృతురాలి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతురాలి కుటుంబ సభ్యులను పరమార్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముషంపల్లి ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని వెల్లడించారు. దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని పిలుపునిచ్చారు. ముషంపల్లి ఘటనపై గ్రామ ప్రజల స్పందన ఇతరులకు మార్గదర్శనం కావాలన్నారు. ఆయన వెంట నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఉప్పల శ్రీనివాస్, డీఐజీ ఏవి.రంగనాథ్ ,నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ మిర్యాలగూడ మున్సిపల్ చైర్మెన్ తిరునగరి భార్గవ్ , టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు నాయకులు కటకం సత్తయ్య గౌడ్ ,సుంకరి మల్లేష్ గౌడ్ ఉన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఐజీ
నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో మహిళపై లైంగికదాడిచేసిి హత్య చేసిన సంఘటనా స్థలాన్ని, మృతురాలి ఇంటిని గురువారం నల్గొండ ఎస్సీ, డీఐ జీ ఏవి.రంగనాథ్ పరిశీలించారు. ఘటనపై పోలీసులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, నల్గొండ జెడ్పీటీసీి వంగూరి లక్ష్మయ్య ఉన్నారు.
మహిళ హత్య కేసులో నిందితులు అరెస్టు
వివరాలు వెల్లడించిన డీిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం మత్తులో బుధవారం నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ధనలక్ష్మిపై జరిగిన లైంగికదాడి, హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముషంపల్లి గ్రామానికి చెందిన బక్కతుట్ల లింగయ్య , యెర్పు జిల్లా శంకర్ అలియాస్ పుల్లయ్య వీరిద్దరూ బాగా తాగిన మైకంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళను బలవంతంగాలింగయ్య ఇంటిలోనికి తీసుకెళ్లారు. వారిద్దరు ఆమెపై లైంగికదాడి చేస్తుండగా మహిళ ప్రతిఘటించడంతో ఆమె తలను నేలకు కొట్టి ,నోరు ,ముక్కు బలవంతంగా మూసి లైంగికదాడి చేసి హత్య చేశారు. అదే సమయంలో సంఘటనను గమనించిన గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని నల్లగొండ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టు టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి , రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
వాసవి క్లబ్ ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండలో రాస్తారోకో
మహిళపై లైంగికదాడి చేసి, హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. మహిళ హత్యకు నిరసనగా గురువారం జిల్లా కేంద్రంలోని ఐద్వా ఆధ్వర్యంలో వాసవి భవన్ నుండి ప్రకాశం బజార్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించిగడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్పీ రంగనాథ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడుతూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయన్నారు. మద్యం మత్తులో రోజుకో ఘటన జరుగుతుందన్నారు.బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.మహిళ కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యల ఘటనలపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 30 రోజులలో నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి , కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు బండ శ్రీశైలం, పట్టణ కార్యదర్శి ఎండి.సలీమ్, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్లగొండ మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, మండల నాయకులు జిల్లా అంజయ్య, దొండ కృష్ణారెడ్డి, కొండా వెంకన్న, పోలే సత్యనారాయణ, బొల్లు రవీందర్, ఊట్కూరు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసాచారి యువజన సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నరేష్, నవీన్, మండల కార్యదర్శి కండే యాదగిరి, జానయ్య, గంగుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.