Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారుల అండదండలతో భూకబ్జాలు..
మఠంపల్లి ఎస్సైను సస్పెండ్ చేయాలి
అన్ని విషయాలపైనా
డీజీపీకి లేఖ రాస్తా
నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ - మఠంపల్లి
'రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది. పోలీసులను అడ్డుపెట్టుకొని నపుంసక రాజకీయాలు చేస్తున్నారు. గుర్రంబోడు ఘటనలో మఠంపల్లి ఎస్సైను సస్పెండ్ చేయాలి' అని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈనెల 13న టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఎంపీ గురువారం పరామర్శించారు. మూడావత్ శ్రీను ఇంటికి వెళ్లి పరామర్శిస్తుండగా తన తలకు 18 కుట్లు పడ్డాయని, ఒంటినిండా గాయాలయ్యాయని.. అయినా ఎస్సై సరైన కేసు కూడా పెట్టలేదని వాపోయాడు. చలించిన ఎంపీ ఎస్సైను రమ్మని కబురు పంపారు. కానీ ఎస్సై రావడానికి నిరాకరించారని చెప్పడంతో వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి కార్యకర్తలకు తగిలిన దెబ్బల గురించి వివరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకొని ఎంపీ సంతోష్ ద్వారా ఎస్సై, సీఐలను ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్ గమనించాలని సూచించారు. గుర్రంపోడులో తమ కార్యకర్తలు గాయపడి బాధపడుతున్నా దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా వారిపై కేవలం పెట్టి కేసులు పెట్టిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. అన్ని విషయాలపైనా డీజీపీకి లేఖ రాస్తానని చెప్పారు. గుర్రంబోడులోని 540 సర్వే నెంబర్లో ఉన్న భూమి పట్టాలు ఇప్పిస్తామన్న ఎమ్మెల్యే, ఎంపీపీలు అధికారులను అడ్డం పెట్టుకొని వందల ఎకరాలు పట్టాలు చేసుకున్నారని, వాటిని కాపాడుకునేందుకు పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడి గిరిజనులు గుర్తించాలని కోరారు. ప్రతిపక్షాలపై దాడులు ఆపాలని, ప్రజలు తిరగబడితే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య మంజినాయక్, నాయకులు నాగన్న గౌడ్, ఎమ్‌డి.నిజాముద్దీన్, తన్నీరు మల్లికార్జున్, ధరావత్ నవీన్ నాయక్, ఒంటిపులి శ్రీనివాస్, పాలకీడు ఎంపీపీ భూక్యా గోపాల్, పీఏసీఎస్ చైర్మెన్, వైస్ చైర్మెన్ రామచంద్రయ్య, బాబు, చిలక గురువయ్య, ఆదూరి కిషోర్ రెడ్డి, భీముడు, సింగారం సైదులు, కరీం, రామిశెట్టి అప్పారావు, కుక్కల నాగరాజు, హనుమ, కృష్ణానాయక్, కోతి సంపత్‌రెడ్డి, బొప్పి మహాలక్ష్మమ్మ, భాస్కర్‌నాయక్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.