Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఐద్వా బహిరంగ సభ
5000 మందితో భారీ ప్రదర్శన
కోలాటాలు, డప్పు చప్పుళ్లతో దద్ద్దరిల్లిన సూర్యాపేట
ప్రభుత్వాలపై విమర్శనస్త్రాలు సంధించిన ఐద్వా నేతలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సూర్యాపేట జిల్లా అంటేనే పోరాటాల గడ్డ. అలాంటి గడ్డపై మహిళా లోకం కదంతొక్కింది. ఐద్వా రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సుమారు 5000 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్లు నుంచి ప్రారంభమైన ప్రదర్శన కొత్త బస్టాండ్ మీదుగా పూలే విగ్రహం, శంకర్ విలాస్సెంటర్, పాత వ్యవసాయ మార్కెట్, పోస్టాఫీస్ సెంటర్ గుండా గాంధీ పార్క్ వరకు సాగింది. ఈ ప్రదర్శనలో కోలాటాలు, డప్పుల దరువులు, నృత్యాలు, ప్రజానాట్యమండలి కళాకారుల మహిళా చైతన్య గీతాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఐద్వా నాయకురాళ్లు ఒకే డ్రెస్‌కోడ్‌తో ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక దాడులను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమైన తీరుపై మహిళలు చేసిన నినాదాలతో సూర్యాపేట మొత్తం దద్దరిల్లింది. చిన్నపిల్లలు, మహిళలపై దాడి చేసిన దుండగులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో సంఘం రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లాకు చెందిన ప్రధాన నాయకురాళ్లు పాల్గొని క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఉత్తేజపరిచేలా నినాదాలు చేయడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అనంతరం గాంధీ పార్కులో బహిరంగ సభ నిర్వహించారు.
ప్రభుత్వాల తీరును తూర్పారపట్టిన ఐద్వా నేతలు
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా మహిళలు తమ హక్కుల సాధన కోసం నడుం బిగించాలని ఐద్వా నేతలు పిలుపునిచ్చారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై, చిన్నపిల్లలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలు, బెల్టుషాపుల కారణంగానే దాడులు జరుగుతున్నా వాటి నివారణలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అంతేగాకుండా దాడి చేసిన దుండగులకు ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు గ్యాస్ రాయితీలో కోతలు విధిస్తున్న కేంద్రం భూస్వాములు బ్యాంకులు లూటీ చేసేందుకు అండగా ఉంటున్నారని విమర్శించారు. రైతుల భూములను కొల్లగొట్టి అంబానీ, ఆదానీలకు చెందిన కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు పాదయాత్ర మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకునేలా ఉంటే బాగుండేదని, ఉత్తర ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో చిన్నారులపై దాడిచేసిన దోషులకు ఆ పార్టీ నాయకులే అండగా ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావలే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, ఎస్.పుణ్యవతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాలడుగు ప్రభావతి, మాచర్ల భారతి, అరుణ జ్యోతి, మద్దెల వినోద, గీత, మహేశ్వరి, లత, లక్ష్మమ్మ , రత్నమాల, ఐద్వా సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంపాల స్వరాజ్యం, మేకన బోయిన సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.