Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
అ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బును బయటకు తీసి ప్రజలకు పంపిణీ చేస్తామని హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను పోగొట్టి యువతను నిరుద్యోగులుగా మారుస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు నూతన చట్టాలు తీసుకవచ్చిందన్నారు. విద్యుత్ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులను హరిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల సవరణ ద్వారా ధరల పెరుగుదలకు అవకాశాలు కల్పించి ప్రజల ఆహారభద్రతకు భంగం కలుగిస్తుందన్నారు. 40 కోడ్లుగా ఉన్న కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్లుగా విభజించి, పరిశ్రమలకు కార్మికులను ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పనిచేసే స్కీం వర్కర్లను కట్టు బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మానవహక్కుల కార్యకర్తలను జైలులో పెడుతున్నదన్నారు. హత్యలు చేయిస్తుందని విమర్శించారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ నియంత్రణ చర్యలు చేపడుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, గోదాములు, మార్కెట్ సౌకర్యం కల్పించాలని, ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, పెట్రోలు, డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని, ఉద్యోగులు కార్మికులకు పని భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 360 రోజులుగా సమ్మె చేస్తున్న రైతులను అపహాస్యం చేస్తూ అణచివేస్తోందని విమర్శించారు. వినతి పత్రం అందజేసిన వారిలో డీసీసీ అధ్యక్షులు కేతవత్ శంకర్ నాయక్, సీపీిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, టీజేఎస్ నాయకులు పన్నాల గోపాల్ రెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు ఇందూరు సాగర్, నాయకులు బండా శ్రీశైలం, పల్లా నరసింహారెడ్డి, పాలడుగు నాగార్జున, శ్రవణ్ కుమార్ ధీరావత్ వీర నాయక్, వెంకటరమణ, అంజయ్య చారి ఉన్నారు.