Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు సాగు దారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, సాగు దారులపై నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్షాల పోరాట ఫలితంగా 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చిందన్నారు. వచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆదివాసీ, గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం సరికాదన్నారు. ఆదివాసి అటవీ హక్కులు, రక్షణ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, పాలకీడు మండలాల్లో 25 వేల ఎకరాలకుపైగా పోడు భూములు ఉన్నాయని, వాటిని గిరిజనులకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడం వల్ల రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలు అమలు కావడం లేదన్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటే ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.