Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-బీబీనగర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలకేంద్రంలోని సాయివెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆ పార్టీ మండల ఏడో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలం పండిన పంట కోసి రైతులు ధాన్యాన్ని కల్లాల్లోకి తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. వర్షాల వల్ల రైతాంగం పండించిన పంట తడిసి ముద్దయ్యే అవకాశం ఉన్నందున కొనుగోలు చేపట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్కెట్లను ఎత్తివేస్తూ నిర్ణయం చేస్తే దాన్ని పరోక్షంగా రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతు న్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పరిశ్రమల్లో నూటికి 60శాతం మంది కార్మికులను బీహార్, ఛత్తీస్‌ఘడ్ లాంటి దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి పరిశ్రమల్లో నివాసం ఉంచుతూ శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. నిత్యం రద్దీగా ఉండే బీబీనగర్ జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు శ్రీరాములు, కందాడి దేవేందర్‌రెడ్డి, గాడి శ్రీనివాస్, సిలివేరు కవిత, ఎరుకలి బిక్షపతి, టంటం వెంకటేశ్, బండారు బాలనర్సింహా, చింతల సుబ్బారెడ్డి, రేసు రామచంద్రారెడ్డి, సందెల రాజేశ్, ధరావత్ రమేశ్‌నాయక్, బండారు శ్రావణ్, జంగయ్య, గడ్డం ఈశ్వర్, పొట్ట యాదమ్మ, ఎల్లాంల సత్యనారాయణ పాల్గొన్నారు.