Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - వేములపల్లి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు అంతర్భాగంలో భాగంగా ఎడమ కాలువపై గల ఎత్తిపోతలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఎల్-14 ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలపై ఎన్నో వాగ్దానాలు చేసిందన్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల నిర్వహణ సరిగా లేక రైతులకు నీరందడం లేదన్నారు. మోటార్లు మరమ్మతులకు నోచక, ఆపరేటర్లు లేక రూ.కోట్లు వెచ్చించిన ఎత్తిపోతల పథకాలు వృథాగా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు మంజూరు చేసి ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. కాలువల్లో కంపచెట్లు పెరిగి ఉన్నాయని, తూములు లేక రైతులకు నీరందడం లేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించాలని కోరారు. లిప్టులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని హామీనిచ్చి ఏడేండ్లు గడుస్తున్నా నేటి వరకూ ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలకు నాసిరకం మోటర్లు, స్టార్టర్లు ఏర్పాటు చేయడం వల్ల అవి పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం మోటర్లు నడిచే పరిస్థితి కూడా లేదని, ప్రతి ఎత్తిపోతల పథకానికి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ మంజూరు చేస్తే లిఫ్టులు నడుస్తాయని తెలిపారు. గతంలో కమ్యూనిస్టులు చేసిన పాదయాత్ర వల్ల ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాధూరి గోవర్ధన, సీపీఐ(ఎం) నాయకులు పతాని శ్రీను, ప్రణీత్‌రెడ్డి, సైదులు, అంకెపాక శ్రీను, రైతులు వెంకటయ్య, కోటయ్య, చెన్నయ్య, ఎల్లయ్య, వెంకట్‌రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.