Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల గర్భాలయంలోకి రిటైర్డ్ పూజారి
ఈవో ఉండగానే ఆ పంతులు ప్రత్యేక పూజలు
అవాక్కయి టెంపుల్ ఆఫీసర్లను సంజాయిషీ కోరిన ఈవో
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి టెంపుల్లో ఆదివారం కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారు. ఏకంగా టెంపుల్ రిటైర్డ్ ప్రధాన పూజారి కారంపూడి నరసింహాచార్యులు కోవిడ్ నిబంధనలు బ్రేక్ చేస్తూ పూజలు నిర్వహించడం కొండపై వివాదంగా మారింది. రిటైర్డ్ ప్రధాన పూజారి తనకు సంబంధించిన బంధువులను బాలాలయం గర్భగుడిలోనికి తీసుకు వెళ్లి తానే స్వయంగా పూజలు చేసి ఆశీర్వచనం చేశారు. అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన టెంపుల్ ఈవో గీత ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. ఒక రిటైర్డ్ పూజారి బాలాలయం గర్భగుడిలోకి ఎలా అనుమతి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అని ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈవో, సూపరింటెండెంట్ లను 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈవో హెచ్చరించారు. ఉదయం శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన ఆలయ ఈవో గీతకు ఈ సంఘటన ఎదురుకావడంతో అవాక్కయ్యారు. తాను ఉండగానే ఇలా రూల్స్ బ్రేక్ చేయడమేంటని ఆమె ప్రశ్నించారు. తాను లేనప్పుడు ఇంకెన్నీ మార్లు నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, రిటైర్డ్ పూజారికి ఎవరు లోనికి అనుమతి ఇచ్చారని టెంపుల్ అధికారులపై ఈవో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆలయ విధులు నిర్వహిస్తున్న అధికారులను ఆమె సంజాయిషీ కోరారు. గత సంవత్సర కాలం నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను బాలాలయం గర్భగుడిలోనికి అనుమతి ఇవ్వడం లేదు. బాలాలయం గర్భగుడి ప్రధాన ద్వారం వద్ద భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పూజారులు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ పూజారి లోనికి వెళ్లి స్వయంగా పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. తన ఇష్టానుసారంగా రిటైర్డ్ ప్రధాన పూజారి వ్యవహరించడం పట్ల స్థానిక భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యాదాద్రి ప్రధాన అర్చకులు రిటైర్డ్ పూజారిని నిలువరించకపోవడం, ఉదయం విధుల్లో ఉన్న పూజారులెవరు కారంపూడిని నిలదీయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా పూజలు జరపడం ఇదే మొదటిసారా..? లేక ఇదివరకు ఇలా అనేక సార్లు జరిగాయా..? అనే కోణంలో విచారించాల్సి ఉంది.