Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పత్తి,వరి ధాన్యం మార్కెట్లోకి విస్తతంగా వస్తున్నందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం జిల్లాకేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన ప్రజాసంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి,వరి ధాన్యం పంటలు చేతికి వస్తున్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను విస్తతంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటలు చేతికి వచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ కొనుగోలుకేంద్రాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాలు విస్తతంగా ఏర్పాటు చేయకపోవడం మూలంగా కమీషన్దారులు,దళారులు ఏకమై నాణ్యత లేమీ పేరుతో లోపాలను చూపిస్తూ వరి ధాన్యాన్ని క్వింటా రూ.1200 నుండి రూ.1500 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.వరి ధాన్యం క్వింటాకు రూ.1,960 కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.పత్తి పంటను క్వింటాకు రూ. 9,000 కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం లాగా క్వింటాకు రూ.750 బోనస్ ఇవ్వాలని కోరారు.కాంటా వేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతాంగానికి వరికి ఎకరాకు రూ. 20,000, పత్తికి ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రైతుబంధు, రైతుబీమా డబ్బులను వెంటనే చెల్లించాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు జిల్లాపల్లి నర్సింహారావు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిల నవీన్,ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం,జీఎంపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి వీరబోయిన రవి,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎల్గూరి గోవింద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూర రాంబాబు,కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు,నాయకులు చిన్నపంగ నర్సయ్య పాల్గొన్నారు.