Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను బిచ్చగాళ్లుగా చూస్తున్నాయని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కష్ణయ్య మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నాయే తప్ప చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపించారు. గురువారం మండలంలోని బాహుపేట స్టేజీ మీదుగా హుజూరాబాద్ వెళ్తున్న ఆర్.కష్ణయ్యకు స్థానిక బీసీ సంఘం నాయకులు స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను ఇన్నేళ్లుగా తమ అవసరాలకు వాడుకున్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా లెక్కలను వెంటనే చేపట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ లో బీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బీసీల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదించకపోతే దేశంలో తిరుగుబాటు వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేటైజేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన అన్ని సంఘాలు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్, సెక్రటరీ గుజ్జ రమేష్, బీసీ సంఘాల నాయకులు వెంకట్, బబ్లూగౌడ్, రావుల రాజు, రాము, మణికంఠ, పాల సంఘం చైర్మెన్లు భాస్కర్, సురేష్, వార్డు సభ్యులు లక్ష్మణ్, బీరయ్య, ఇస్తారి పాల్గొన్నారు.