Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిప్రాయాలను పర్యావరణ శాఖకు పంపుతాం :
అదనపు కలెక్టర్
పరిశ్రమల వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే సైదిరెడ్డి
కాలుష్య నియంత్రణలో రాజీ లేదు :
నాగార్జున సిమెంట్ ఎండీ కలిదిండి రవి
మఠంపల్లి:నాగార్జున సిమెంట్ పరిశ్రమ విస్తరణకు గురువారం అదనపు కలెక్టర్ మోహన్ రావు అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలందరూ ముక్తకంఠంతో పరిశ్రమ విస్తరణ కోసం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పరిశ్రమ నుంచి ప్రస్తుతం ఏడాదికి 2.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా నాలుగు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పరిశ్రమ విస్తరిస్తున్నారు. మొత్తం 52 మంది వక్తలు తమ అభిప్రాయాలు నేరుగా వెల్లడించారు. 45 మంది దరఖాస్తు రూపంలో అదనపు కలెక్టర్కు అందించారు. వక్తలు పరిశ్రమ విస్తరణతో పాటు కాలుష్య నియంత్రణ, పచ్చదనం, గ్రామాల అభివృద్ధి, స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
పరిశ్రమలు వ్యాపార అభివద్ధికి ప్రభుత్వం కషి : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపన, వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 35 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని, స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు 70 నుంచి 80 శాతం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారని, ఇందుకు పరిశ్రమల నిర్వాహకులు ముందుకొచ్చారన్నారు.
కాలుష్య నియంత్రణలో రాజీ పడేది లేదు : కలిదిండి రవి - ఎండీ ఎన్సీఎల్
కాలుష్య నియంత్రణలో రాజీ పడేది లేదని, ఎంత ఖర్చు అయినా వెనుకాడబోమని పరిశ్రమ ఎండీ కలిదిండి రవి అన్నారు. అర్హతలను బట్టి స్థానికులకు ఎక్కువగా కల్పిస్తామన్నారు. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు ముందడుగు వేయాల్సి వస్తుందని, అందుకే విస్తరణకు పోతున్నట్టు తెలిపారు. తమ సంస్థలో 52 వేల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారని, హైదరాబాద్ సమీపంలోని మల్కాపురంలో అల్యూమినియం కిటికీలు, డోర్ ఫ్రేమ్స్ పరిశ్రమ ఉందని, ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు. రూ.371 కోట్లతో పరిశ్రమ విస్తరణ చేపట్టబోతున్నట్టు చెప్పారు. ఇందులో పర్యావరణం, మౌలిక వసతులకు రూ.6 కోట్లా 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమ విస్తరణతో 250 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇఈ రాజేందర్, ఆర్డీవో వెంకారెడ్డి, పరిశ్రమ ఈడీ కలిదిండి గౌతం, పరిశ్రమ అధికారులు రాజా, చక్రధర్, శ్రీకాంత్, దస్తగిరి రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీపీ పార్వతి కొండానాయక్, జెడ్పీటీసీ బానోతు జగన్ నాయక్, మన్యం శ్రీనివాస్ రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి, చెన్నూరి మట్టపల్లిరావు, కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి, యరగాని నాగన్న, భూక్య మంజునాయక్, స్థానిక సర్పంచ్ దాసరి విజయలక్ష్మి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 350 మందితో భారీ బందోబస్తు నిర్వహించారు.