Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
దళితబందు పథకాన్ని జిల్లాలోని దళితులందరికీ వర్తింపజేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబందు పథకాన్ని జిల్లా అంతట అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు చైర్మెన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన దళితబంధు పథకం సూర్యాపేట జిల్లాలోని ఒక మండలానికే పరిమితం చేయడం సరికాదన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలు, కుల వివక్ష ఘటనలను విన్నవించుకోవడం కోసం ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్కు చైర్మెన్ లేకపోవడంతో అది తల లేని మొండెంలా తయారైందన్నారు. వెంటనే ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్కు చైర్మెన్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్దిదారుడికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలకిచ్చే ప్రోత్సాహక డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా నాయకులు జె.నరసింహారావు, చినపంగి నర్సయ్య, బాలెంల శ్రీను, రత్నం, సోమపంగు సాయి తేజ, కోట గోపి, నందిపాటి వెంకటేష్, ములకలపల్లి సైదులు, నవీన్, శ్రీధర్, శ్రీహరి, రుత్విక్, శ్రీకాంత్, ఉదరు బాబు తదితరులు పాల్గొన్నారు.