Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలు సరే...
- మా గౌరవ మర్యాదల సంగతేందని ప్రశ్నించిన సభ్యులు
- యాదాద్రి జెడ్పీ సమావేశంలో అధికారుల నిలదీత
- పాలకుల ఒత్తిడికి అధికారులు తలొగ్గొద్దు : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి
- ప్రొటోకాల్‌పై అధికారులకు అవగాహన లేదు : ఎమ్మెల్యే సునీత
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తమ సమస్యలు చర్చించి వాటిని పరిష్కరేందుకు ప్రజలు తమ ద్వారా ఎన్నుకున్న సభ్యులను పంపిస్తే వారు మాత్రం ప్రజలు...వారి సమస్యలు సంగతి ఆలా ఉంచి తమకు గౌరవ, మర్యాదలు ఇవ్వడంలేదని మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్ సభ్య సమావేశంలో సభ్యులు అధికారులను నిలదీశారు. ఉదయం 11-30 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే జెడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదల నగేష్ జిల్లా పరిషత్ సభ్యులకు ఎస్ఎఫ్సీ నిధులు, తమ మండలాల్లో ప్రొటోకాల్ దక్కడం లేదని, ఎజెండా కంటే ముందు వీటిపై చర్చించాలని తన ఆవేదనను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 'మీరా సభాధ్యక్షత వహించేదీ..నేనా.. మీరు చెప్పింది..వెంటనే వినాలా.' అంటూ జెడ్పీ చైర్మెన్ సందీప్‌రెడ్డి కలుగజేసుకుని సీరియస్‌గా మైక్ కట్ చేయమని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేసి మైక్‌ను నెలకేసి కొట్టారు. 'మీ సభ అయితే మీరే నడుపుకోండి..ఇక మేమేందుకు' అంటూ నిలదీశారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులంతా పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ వలిగొండ మండలంలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా తమకు సరైన సమాచారం ఇవ్వలేదని, కొంతమంది ప్రజా ప్రతినిధులు పేర్లు శిలాఫలంపై పెట్టలేదని, ఇతర సందర్భంలో కూడా చెక్కుల పంపిణీకి అప్పటికప్పుడు కార్యక్రమం ఉందని సమాచారం ఇస్తున్నారని తెలిపారు. అయితే అక్కడే ఉన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎందుకు ఇలా జరిగిందని చైర్మెన్ ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్టుగా ప్రజా ప్రతినిధుల పేర్లు పెట్టామని సమాధానం చెప్పారు. దీంతో ఒక్కసారిగా సభ్యులంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు అధికారులు నడుచుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రొటోకాల్ విషయంపైనే సుమారు రెండున్నర గంటల పాటు సమావేశంలో చర్చ జరిగింది. చివరకు ప్రొటోకాల్ పాటించాలని సమావేశంలో తీర్మానించారు.
ప్రొటోకాల్‌పై అధికారులకు అవగహన లేదు : ఆలేరు ఎమ్మెల్యే సునీత
ఆలేరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే ముందు శిలాఫలకంపై పేర్లు తమకు తెలియదని చేతులేత్తేయడం విడ్డూరంగా ఉంది. కలెక్టర్ అధికారు లకు శిక్షణ ఇవ్వాలి. స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉండాల్సిందే. ఎవరూ ఉల్లంఘించిన చర్యలు తీసుకో వాలి. తమకు ఎక్కువగా కార్యక్రమాలు ఉండడం వల్ల కొన్ని తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర సందర్భాల్లో ఎంపీ సమయం తీసుకుని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. కానీ ప్రజా ప్రతినిధులకు దక్కాల్సిన గౌరవం దక్కాల్సిందే.
పాలకుల ఒత్తిడికి తలొగ్గొదు : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి
పాలకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు పనిచేయాలి. నిబంధనలు పాటించాలి. సుమారు 30 ఏండ్ల సర్వీస్‌లో ఉండేవాళ్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో గొడవ పడొద్దు. తప్పులు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం జరగాలి.
ప్రొటోకాల్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా
ఎలిమినేటి సందీప్‌రెడ్డి : జెడ్పీ చైర్మెన్
ఈ మధ్య కాలంలో వలిగొండ, బీబీనగర్ మండలాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సమయంలో నాకు కనీస సమాచారం లేదు. నన్ను కార్యక్రమానికి ఆహ్వానించకున్నా సరే కానీ, జరుగుతున్న విషయం తెలియాలి కదా..తననే ఇలా అవమానపరుస్తున్నపుడు కింది స్థాయిలో ఉండే సభ్యుల సంగతేంది. సంబంధిత కార్యక్రమణ నిర్వహణ అధికారులపై ఫిర్యాదు చేస్తా.
కమీషన్లు ఇస్తేనే పనులు
చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి - చౌటుప్పల్ జెడ్పీటీసీ
ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభివృద్ధి పనులకు కమీషన్లు లేనిదే అధికారులు ఎంబీ రికార్డు చేయడం లేదు. టెండర్ వేస్తేనే 25 శాతం తక్కువకు కోడ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పనులు చేయడం కష్టం. ఈ విషయంపై ప్రతి సమావేశంలో చెబుతున్నా పరిస్థితిలో మార్పురావడం లేదు.