Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-హుజూర్నగర్
సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేటను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల కాలంలో హుజూర్నగర్, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లో కొంతమంది యువకులు గంజాయికి అలవాటు పడ్డారన్నారు. గరిడేపల్లి మండలం కట్ట వారిగూడెం గ్రామంలో పఠాన్ మస్తాన్‌సాబ్ పత్తి వ్యవసాయం, షేక్ ఖాదర్ భాష గ్రామంలోని పాడుబడ్డ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విషయం తెలిసి వారిని అదుపులోకి తీసుకుని 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా మన్నారు. ఈ కేసు విచారణ ఇంకా సాగుతోందన్నారు వైజాగ్, దారకొండ, భువనేశ్వర్ తదితర ప్రాంతాల నుండి గంజాయి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, ఆంధ్రా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల సరిహద్దుల వద్ద తనిఖీలు పెంచామన్నారు. యువత బంగారు భవిష్యత్‌ను కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో గానీ, హుజూర్నగర్ నియోజకవర్గంలోని గానీ, ఏ గ్రామంలోనూ గంజాయి సాగు చేస్తున్న విషయం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయికి అలవాటు పడ్డ యువత నేరాల వైపు మళ్లే అవకాశం ఉందన్నారు. గంజాయి సాగు నిర్మూలనకు అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. గంజాయి వాడే వారి ఆచూకీ తెలిసినట్టయితే వారికి పోలీస్ శాఖ వారు కౌన్సెలింగ్ చేయడం, పునరావాస కేంద్రాలకు పంపించి వారిని బాగు చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 30 కేసు నమోదు చేశామన్నారు. గతంలో గంజాయి రవాణా రహస్యంగా జరిగేదని, కానీ ప్రస్తుతం రహస్యంగా సాగు చేసే పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్‌రెడ్డి, గరిడేపల్లి ఎస్సై కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.