Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన నిర్వాహకుల మధ్య మనస్పర్థాలు
- విద్యార్థుల ఆకలి బాధలు చూడలేక
- వంటలు చేసిన ఉపాధ్యాయులు
నవతెలంగాణ-తుంగతుర్తి
పాఠాలు బోధించాల్సిన మాస్టారు..గంటె పట్టారు.. మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యుల మధ్య సఖ్యత లేక పోవడం, ఘర్షణలు జరగడంతో వారు డుమ్మా కొట్టడంతో విద్యార్థులను పస్తులు ఉంచడం ఇష్టం లేక..తానే వంట మాస్టారుగా మారారు. ఈ ఘటన మండల పరిధిలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదేండ్ల నుంచి ముగ్గురు మహిళలు మధ్యాహ్న భోజన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం వండడానికి రావడం లేదు. వచ్చినా భోజనం రుచికరంగా తయారు చేయడం లేదు. ఏజెన్సీ సభ్యుల గొడవల కారణంగా 115 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం కూడా వారు మధ్యాహ్నం భోజనం వండేందుకు రాలేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువయ్యతో పాటు ఉపాధ్యాయులు వంట మనిషిగా మారారు. ఇప్పటికైనా జిల్లా, మండల విద్యాధికారులు స్పందించి పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.